calender_icon.png 17 December, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్పలత సూపర్ బజార్ తనిఖీలో బయటపడ్డ కుంభకోణం

16-12-2025 06:35:35 PM

బినామీ పేర్లతో జీతాలు తీసుకున్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ది కోపరేటివ్ స్టోర్ లిమిటెడ్ పరిధిలోని కల్పలత సూపర్ బజార్ లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కల్పలత సూపర్ బజార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మితిగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కార్యాలయానికి చేరుకున్న సమయంలో సిబ్బంది లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రిజిస్టర్ లో ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు నమోదు చేసి, కేవలం ముగ్గురు మాత్రమే హాజరవడం, వారిలో ఇద్దరే విధుల్లో ఉండటంపై ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. జమ ఖర్చు వివరాలు రిజిస్టర్లు, ఇతర రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

తనిఖీల్లో పలు అవకతవకలు వెలుగులోకి వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. సభ్యత నమోదులో ఆర్థిక అవకతవకలు జరిగాయని, సభ్యత్వ రుసుము వినియోగానికి సంబంధించి సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. పాలకమండలి సభ్యులు గత మూడేళ్లుగా సొంత అవసరాలకు డీజిల్, పెట్రోల్ వినియోగించుకున్నారని, ఎలాంటి అనుమతి లేకపోవడమే కాకుండా బిల్లులు కూడా చెల్లించలేదని వెల్లడించారు. కోపరేటివ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకులో పదిమంది సిబ్బంది పేర్లతో నెలకు పదివేల చొప్పున జీతాలు తీసుకుంటున్నారని, అయితే రిజిస్టర్లో వారి సంతకాలు లేవని తెలిపారు. బినామీ పేర్లతో చెల్లించినట్లు స్పష్టం అవుతుందని ఎమ్మెల్యే మండిపడ్డారు.

అవకతవకలపై వెంటనే సంబంధిత రికార్డులను సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ కు ఫోన్ ద్వారా సూచించారు. అనంతరం డిఆర్ఓ కార్యాలయాన్ని చేరుకొని రికార్డులను పరిశీలించారు. కల్పలత సూపర్ బజార్ కమిటీని తక్షణమే రద్దుచేసి సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్, డిఆర్ఓలకు ఎమ్మెల్యే సూచించారు. తనిఖీల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా రోజులుగా కల్పలత సూపర్ బజార్లో అవకతవకలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని, అయితే తప్పు చేసిన వారిపై మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.