27-11-2025 12:13:57 AM
నూతనకల్, నవంబర్ 26: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, బుధవారం డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో నూతనకల్ ఎస్త్స్ర నాగరాజు మండలంలోని సమస్యాత్మక గ్రామాలలో పర్యటించారు.మండల పరిధిలోని మిర్యాల, చిల్పకుంట్ల, తాళ్ల సింగారం గ్రామాలలో ఎన్నికల పోలింగ్ బూతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామ పరిస్థితులను, ఎన్నికల వాతావరణాన్ని పర్యవేక్షించారు.అనంతరం గ్రామస్తులతో సమావేశమై ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాలని, పౌరులు పాటించాల్సిన ప్రవర్తనా నియమాలు గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ఎన్నికలు ప్రజాస్వామ్య సమాజంలో పండుగ లాంటివి అని అభివర్ణించారు.
ప్రతి ఒక్కరూ ఎలాంటి గొడవలు, విభేదాలు పెట్టుకోకుండా సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని, ఎన్నికల సమయంలో కేసులు నమోదైతే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదురవుతాయని, ముఖ్యంగా యువత ఈ విషయంలో ఆదర్శంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ స్వేచ్ఛాయుత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల భద్రత, రక్షణ కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని, ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఎవరూ చట్ట ఉల్లంఘనకు పాల్పడకూడదని స్పష్టం చేశారు.