calender_icon.png 16 December, 2025 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం

06-12-2024 03:01:39 AM

ప్రధానిపై నెగ్గిన అవిశ్వాసం

మూడు నెలలు మాత్రమే పదవిలో ఉన్న మిచెల్

పారిస్, డిసెంబర్ 5: ఫ్రాన్స్‌లో ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధానమంత్రి మిచెల్ బార్నియర్ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ప్రధాని మిచెల్ తన పదవిని కోల్పోయారు. దీంతో దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ మూడు నెలల కిందటే(జులైలో) మిచెల్‌ను ప్రధానిగా ఎంపిక చేశారు. బడ్జెట్‌ను ఓటింగ్ లేకుండానే ఆమోదించడానికి మిచెల్ బార్నియర్ ప్రయత్నించారు.

దీంతో ప్రతిపక్షాలు లెఫ్ట్ వింగ్‌తోపాటు రైట్ వింగ్ పార్టీ నేషనల్ ర్యాలీ పార్టీలు ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాయి. అవిశ్వాస తీర్మానాన్ని లెఫ్ట్ వింగ్ సభ్యులు ప్రవేశపెట్టగా నేషనల్ ర్యాలీకి చెందిన నాయకురాలు మారైల్  లీపెన్ మద్దతు ప్రకటించారు.

పార్లమెంట్‌లో మొత్తం 577 ఓట్లు ఉన్నాయి. అవిశ్వాసానికి అనుకూలంగా 331 ఓట్లు పడ్డాయి. బార్నియర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1962 తరువాత అవిశ్వాసం నెగ్గింది. దీంతో ప్రధాని బార్నియర్ అధ్యక్షుడు మెక్రాన్‌ను కలిసి తన రాజీనామా సమర్పించనున్నారు.

ప్రధానిగా మిచెల్ కేవలం మూడు నెలలు మాత్రమే అధికారంలో ఉన్నారు. అత్యంత తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా బార్నియర్ నిలిచారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న  గాబ్రిచేల్ అట్టల్(34) జులైలో పదవి నుంచి దిగిపోవడంతో మిచెల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ ఏడాదిలోనే మూడోసారి ప్రధానిని నియమించడం మెక్రాన్‌కు ఇబ్బందికరంగా మారింది. అయితే తనను పదవి నుంచి తొలగించినంత మాత్రానా ఫ్రాన్స్ ఆర్థిక సమస్యలు పరిష్కారం కావని అంతకుముందు మిచెల్ చెప్పారు. జులై వరకు కొత్త పార్లమెంటరీ ఎన్నికలు లేకపోవడంతో అప్పటివరకు మిచెల్ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంది.

ప్రస్తుతం సభలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేదు. అయితే ప్రెసిడెంట్‌కు, ప్రధానికి వేర్వేరు ఓటింగ్ ఉండడంతో అధ్యక్షుడిపై ఈ తీర్మాన ప్రభావం ఉండదు.