27-07-2025 12:40:12 AM
- సైనిక్, నవోదయ స్కూళ్లు ఏర్పాటు చేస్తం
- కేంద్ర మంత్రి బండి సంజయ్
- మోదీ గిఫ్ట్ పేరుతో స్టూడెంట్స్‌కు సైకిళ్ల పంపిణీ
హుస్నాబాద్, జూలై 26: తానూ, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
శనివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ‘మోదీ గిఫ్ట్‘ పేరుతో ప్రభుత్వ పాఠ శాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా పొన్నం ప్రభాకర్, తానూ కలిసి పని చేస్తామన్నారు. హుస్నాబాద్‌లో త్వరలోనే నవోదయ స్కూల్ ఏర్పాటు చేసి, వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభిస్తామని తెలిపారు. సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కూడా కృషి చేస్తున్నామని చెప్పారు.
పొన్నం ప్రభాకర్ ‘స్టీల్ బ్యాంక్‘ ఏర్పాటును అభినందించారు. ‘ప్రభుత్వ పాఠశాలల్లో చదవండి. సైకిల్‌ను బహుమతిగా పొందండి’ అని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. తాను ఎంపీగా ఉన్నంత కాలం ప్రతి ఏటా పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందిస్తాననిహామీ ఇచ్చారు. ఇది ప్రధా ని మోదీ సూచనతో అందిస్తున్న ‘నరేంద్ర మోదీ గిఫ్ట్‘ అని అన్నారు