27-07-2025 12:38:27 AM
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొద టి త్రైమాసికంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆదాయాలు పేలవంగా ఉన్నా యని, రుణాలు గణనీయంగా పెరిగాయని కాగ్ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్-, జూన్ త్రైమాసికంలో తెలంగాణ ఆదాయం రూ. 37,221.80 కోట్లుగా ఉంది. ఇది 2025--26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రూ. 2,29,720.62 కోట్లలో 16.20 శాతం.
కాగ్ గణాంకాల ప్రకారం.. పన్నుయేతర ఆదాయంలో తగ్గుదల కారణంగా ఈ గణనీయమైన అంతరం ఏర్పడింది. ఇది రూ.1,066.22 కోట్లుగా ఉంది. ఇది బడ్జెట్‌లో పేర్కొన్న రూ.31,618.77 కోట్లలో (పూర్తి సంవత్సరానికి) కేవలం 3.37 శాతం మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ర్ట ప్రభుత్వ రుణా లు, ఇతర అప్పులు (నికరం) రూ. 54, 009.74 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఆదాయం రూ. 20,266.09 కోట్లు (37.52 శాతం)గా ఉంది.
తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్- ఇన్- ఎయిడ్, సహకారాలు రూ. 22,782.50 కోట్లుగా అంచనా వేశారు. వాస్తవ వసూళ్లు రూ. 433.77 కోట్లుగా ఉండి, కేవలం 1.9 శాతం మాత్రమే సాధించాయి. తెలంగాణ ప్రభుత్వం 2025--26 బడ్జెట్‌లో రూ. 2,738.33 కోట్ల రెవెన్యూ మిగులును సమర్పించింది. అయితే మొదటి త్రైమాసికం చివరి నాటికి రూ.10,582.85 కోట్ల లోటు ఉంది.
ఏపీ ఆదాయం రూ. 36,239.37 కోట్లు
మొదటి త్రైమాసికంలో ఏపీ రాష్ర్ట ఆదాయం రూ. 36,239.37 కోట్లుగా ఉన్నాయి. ఇది పూర్తి సంవత్సరానికి బడ్జెట్‌లో రూ. 21,7976.53 కోట్లలో 16.63 శాతం. పన్నుయేతర ఆదాయాలు, గ్రాంట్-ఇన్-ఎయిడ్, సహకారాలు తగ్గడం వల్ల ఈ తగ్గుదల సంభవించింది. ఏపీ పన్నుయేతర ఆదాయం రూ.1,269.28 కోట్లుగా ఉంది, ఇది మొత్తం లక్ష్యం రూ. 19,119.04 కోట్లలో 6.64 శాతం.
అదేవిధంగా, రాష్ర్టం గ్రాంట్- ఇన్- ఎయిడ్‌గా రూ. 32,284.40 కోట్లు ఆశించగా, క్యూ1లో రూ. 1,465.09 కోట్లు (4.54 శాతం) అందుకున్నది. ఆంధ్రప్రదేశ్ తన 2025--26 రాష్ర్ట బడ్జెట్‌లో రూ.44,928.78 కోట్ల ఆర్థిక లోటును అంచనా వేసింది, అయితే మొదటి త్రైమాసికం చివరి నాటికి అది రూ. 27,667.39 కోట్ల వద్దనే ఉందని కాగ్ గణాంకాల్లో వెల్లడించింది.