29-09-2025 12:00:00 AM
-గ్రూప్ ఫలితాలు విడుదల
-తుది ఎంపిక జాబితా ప్రకటించిన టీజీపీఎస్సీ
-మెడికల్ రిపోర్ట్ రాని కారణంగా విత్‌హెల్డ్‌లో ఒక పోస్టు
-18రకాల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
-దసరాలోపే ఉద్యోగార్థులకు నియామకపత్రాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): గ్రూప్ తుది ఫలితాలను టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది. టీజీపీఎస్సీ సభ్యులతో కలిసి చైర్మన్ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 783 పోస్టులకు 782 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. మెడికల్ రిపోర్ట్ రాని కారణంగా ఒక పోస్టు భర్తీని పక్కనపెట్టారు. గ్రూప్ భాగంగా మొత్తం 18 రకాల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేశారు. పరీక్ష నిర్వహించిన 10 నెలల్లోనే ఫలితాలు వెల్లడించామని కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు.
సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు
గ్రూప్ -2 తుది ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విజేతలకు దసరాలోపే నియామక పత్రాలు అందజేయాలని టీజీపీఎస్సీ వర్గా లు భావిస్తున్నాయి. సీఎం చేతుల మీదుగా విజేతలకు నియామకపత్రాలు అందించే అవకాశముంది. అక్టోబర్ 2న దసరా పండుగ ఉండగా, లేకుంటే అంతలోపే శాఖల వారీగా నియామకపత్రాలిచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు సమాచారం.
కేసీఆర్ హయాంలోనే నోటిఫికేషన్
గ్రూప్ పోస్టుల భర్తీకి గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే నోటిఫికేషన్ విడుదలయ్యింది. 2022లో 783 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయగా, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరీక్షలు వాయిదాపడ్డాయి. 2024 డిసెంబర్‌లో రాత పరీక్షలను టీజీపీఎస్సీ నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 11న జనరల్ ర్యాకింగ్ లిస్టును విడుదల చేశారు. మొత్తం 5,51,855 మంది గ్రూప్ దరఖాస్తు చేయగా, 236,649 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించి, తాజాగా తుది ఫలితాలను కమిషన్ విడుదల చేసింది.