03-01-2026 03:25:48 PM
హైదరాబాద్: కృష్ణా జలాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Irrigation Minister Uttam Kumar Reddy) తెలంగాణ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ సభ్యులు సభకు ఎందుకు రావడంలేదని, దీనిపై బీఆర్ఎస్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను వదులుకోమని, ఈ అంశంలో మాపై పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ కంటే మిన్నగా నీటి హక్కులు కాపాడే ప్రయత్నం చేస్తున్నామని, బీఆర్ఎస్ హయంలోనే కృష్ణా జాలాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. తెలంగాణకు 299 టీఎంసీలు చాలని రాసిచ్చిన ఘనత బీఆర్ఎస్ దే అని ఆయన విరుచుపడ్డారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ కి 512 టీఎంసీలు ఇవ్వొచ్చని, బీఆర్ఎస్ హయంలో ఇరిగేషన్ పై రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికి ఎక్కడ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త ఆయకట్టును సృష్టించలేకపోయారని ఇరిగేషన్ మంత్రి ఎద్దేవా చేశారు.
2022 వరకు పాలమూరు రంగారెడ్డికి డీపీఆర్ కూడా తయారు చేయలేదని, ఈ ప్రాజెక్ట్ ను 90 శాతం పూర్తి చేసినట్టు కేసీఆర్ చెబుతున్నారని అన్నారు. కానీ 33 శాతానికి మించి ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి కాలేదని, డీపీఆర్ ఇచ్చేలోపే 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. మేం అధికారంలోకి వచ్చేనాటికి రూ.10 వేల కోట్లు ఇరిగేషన్ బిల్లులు పెండింగ్ ఉన్నాయని, పాలమూరు రంగారెడ్డికి ఎలాంటి అనుమతులు తీసుకురాలేదని ఉత్తమ్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు రూ.90 వేల కోట్లు ఖర్చు చేశారని, పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్ట్ కోసం రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రూ.7 వేల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి వెల్లడించారు.