calender_icon.png 5 January, 2026 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యామ్ ఫట్‌లు ఇక వద్దు!

04-01-2026 01:16:12 AM

* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన హ్యామ్ రోడ్ల  విధానంలో లోపాలున్నాయని ‘విజయక్రాంతి’ ముందుగానే హెచ్చరించింది. ఈ విధానం పచ్చిమోసం అని వాదించింది. హ్యామ్ రోడ్లకు టెండర్లు పిలిచినా ప్రయోజనం లేకపోవడంతో ఇప్పుడు ఆ విధానమే చర్చనీ యాంశంగా మారింది. దానిని అమలుచేయడంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన పద్ధతులు వివాదాస్పదమయ్యాయి.

మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చుక్కెదురైనట్టుగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రోడ్ల కోసం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్)కు మళ్లీ టెండ ర్లు పిలవాలని భావిస్తున్నట్టు తెలియవచ్చింది. తెలంగాణ ప్రభు త్వం రూ. 20 వేల కోట్లతో హ్యామ్ కింద రాష్ట్రంలోని 13 వేల కిలోమీటర్లకు పైగా గ్రామీణ రోడ్లను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే హ్యామ్ విధానంలో చేపట్టనున్న ఈ పనులకు 40 శాతం నిధులను ప్రభుత్వం ముందుగానే చెల్లించనుం డగా, మిగతా 60 శాతం నిధులను బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో టెండర్లు పొందిన కాంట్రాక్టర్లే సమీకరించుకోవాల్సి ఉంటుంది.

హ్యామ్ కింద ప్రాజెక్టు పూర్తయిన తర్వాత డెవలపర్లు 10 నుంచి 15 సంవత్సరాల వ్యవధిలో స్థిర యాన్యుటీల ద్వారా పెట్టిన పెట్టుబడులను వడ్డీతో సహా తిరిగి పొందుతారని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు హ్యామ్ కింద గ్రామీణ ప్రాంతాల రోడ్లను జాతీయ రహదారులకు కనెక్ట్ చేయడం ద్వారా తెలంగాణ భౌగోళిక స్వరూపం పూర్తిగా మారుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం హ్యామ్ రోడ్ల కోసం ఇటీవలే కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను ఆహ్వానించింది.

కానీ టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో ప్రభుత్వానికి తలవంపులు ఎదురయ్యాయి. హ్యామ్ రోడ్ల విధానంలో లోపాలున్నాయని ‘విజయక్రాంతి’ ముందుగానే హెచ్చరించింది. హ్యామ్ రోడ్లకు టెండర్లు పిలిచినా ప్రయోజనం లేకపోవడంతో ఇప్పుడు ఆ విధానమే చర్చనీయాంశంగా మారింది. ౨౦౧౬లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హైబ్రిడ్ విధానాన్ని తెచ్చింది. అయితే దానిని అమలుచేయడంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన పద్ధతులు వివాదాస్పదమయ్యాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందనే భావనతో ఆదారా బాదరాగా ఈ విధానాన్ని తీసుకువచ్చారు. అయితే టెండర్ల విధానంలోనే ఇది కుప్పకూలింది. ఈ విధానం పచ్చిమోసం అని ‘విజయక్రాంతి’ వాదించింది. ప్రైవేటు వారికిచ్చే సబ్సిడీలతో పన్ను చెల్లింపుదారులకు వచ్చే ౧౫ ఏళ్లు భారం మోపడమేనని తెలిపింది. వ్యయం భారమై, రాష్ట్ర ఖజానాపై దీని ప్రభావం పడు తుందని భారత బిల్డర్స్ అసోసియేషన్ కూడా హెచ్చరించింది.

ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనల మేరకే ఈ విధానాన్ని అమలుచేస్తున్నట్లు చెప్పుకుంది. అయితే రైతుల, ఇతర వర్గాల నుంచి వస్తున్న నిరసనలు గమనించి బ్యాంకులు రుణం ఇచ్చేందుకు వెనుకడుగు వేశాయి. దీంతో హ్యామ్‌కు టెండర్లు వేసేవారే కరువయ్యారు. దీనిని ఎన్నికల పటాటోపంలా చూసినవారు కొందరు.. ఇందు లో ఏదో కమీషన్ల భాగోతం ఉందని అనుకున్నవారు కొందరు. 

పైగా తాము తీసుకున్న రుణాలకు సంబంధించిన చెల్లింపులు ఎలా చేస్తారు? ఎంత చేస్తారు? అనే అంశాలపై కాంట్రాక్టర్లు ప్రభుత్వం వద్ద స్పష్టత కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోతే బ్యాంకుల్లో తమ కంపెనీలకు రేటింగ్‌లు తగ్గిపోవడంతో పాటు భవిష్యత్తులో రుణాలు తీసుకునే వెసులుబాటు ఉండదని కాంట్రాక్టర్లు భావించారు. ఈ కారణం చేతనే ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలు హ్యామ్ రోడ్ల కోసం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

దీంతో పునరాలోచనలో పడిన రేవంత్ ప్రభుత్వం హ్యామ్ కింద రోడ్లను అభివృద్ధి చేసేందుకు అవసరమయ్యే నిధులను తిరిగి చెల్లించే విషయమై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి గ్యారెంటీ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇందుకు అవసరమైన అన్ని చర్యలను అధికార యంత్రాంగం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

ఆంధ్రా ఉదాహరణగా.. 

అయితే మన పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ రావతి రాజధాని పునరుద్ధరణ, ఇతర మెగా ప్రాజెక్టుల కోసం నిధులు సమీకరించిన తీరును రేవంత్‌రెడ్డి పరిశీలించాల్సిన అవసరముంది. మెగా ప్రాజెక్టులను రూపొందిం చేందుకు చంద్రబాబు నిర్మాణరంగంలో పేరుమోసిన దిగ్గజాలు, విదేశీ పెట్టు బడిదారులను పెద్దఎత్తున రాష్ట్రానికి వ చ్చేలా ప్రోత్సహించి నిధులు రాబట్టడం లో విజయవంతమయ్యారు.

వివిధవర్గా లకు చెందిన బడా వ్యాపారవేత్తలతో ప్రత్యక్ష సం భాషణలు కొనసాగించి నష్టాలను అధి గమించి ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తిచేశారు. అయి తే ‘విజయక్రాంతి’ కూడా హ్యామ్ ప్రాజెక్టు కోసం కొన్ని సూచనలు చేసింది. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నిర్మాణ సంస్థలు, విదేశీ పెట్టుబడిదారులతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు ఏర్పా టు చేయాలని కోరింది. ప్రాజెక్టుపై సుదీర్ఘ చర్చల ద్వారా ఎటువంటి ఇబ్బంది లే కుండా పెట్టుబడులను ఆకర్షించేం దుకు ఉపకరిస్తుందని తెలిపింది.

ఈ దిశగా ఈపీసీ మో డలే బెటర్ అని భావిస్తున్నది. ప్ర స్తుతం భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హ్యామ్ ప్రాజెక్టు విషయంలో బ్యాంకులు, ఇతర వాటాదారుల ఆమోదంతోనే ప్రాజెక్టుకు సంబంధించిన నమూనాలు రూపొందించుకోవాలి. అంతిమంగా 2026 ఏడాది మొద ట్లోనే రేవంత్ సర్కార్ హ్యామ్ ప్రాజెక్టు పేరుతో ఒక కన్ఫ్యూజన్‌లో పడిపోయింది.

అయితే ప్రభుత్వం తమ ముందున్న అన్ని అడ్డంకులు దాటుకొని హ్యామ్ కింద టెండర్లను తిరిగి జారీ చేయగలిగితే రేవంత్ సర్కార్ కలలుగంటున్న గ్రామీణాభివృద్ధి సాకారమయ్యే అవకాశం ఉంటుంది. అలా కాదని నిపుణుల హెచ్చరికలను, ఆర్బీఐ మార్గదర్శకాలను పట్టించుకోకుండా తమకు నచ్చిందే చేస్తామన్న ధోరణిలో ముందుకు వెళ్తే మాత్రం ప్రభుత్వం చేతులు మరోసారి కాలిపోయే ప్రమాదం లేకపోలేదు. రాబో యే నెలల్లో తెలంగాణలో హ్యామ్ ప్రాజెక్టు ప్రభుత్వానికి నష్టం మిగులుస్తుందా లేదా లాభం కలిగిస్తుందా అన్నది చూడాలి.

ముఖ్యమంత్రి అసంతృప్తి..

మరోవైపు రేవంత్‌రెడ్డి.. ఎటువంటి నమూనా, డిజైన్లు రూపొందించకుండానే టెండర్ల తయారీపై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. బాధ్యులలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి ముందుకు కదులుతున్నట్లుగా అభిజ్ఞవర్గాలు తెలిపాయి. ఇక ఆర్బీఐ గ్యారెంటీ తీసుకోవాలని భావిస్తున్న రేవంత్ సర్కార్ ఇందుకోసం ప్రభుత్వం-కాంట్రాక్టర్లు-బ్యాంకులకు కలిపి ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

పనులు దక్కించుకున్న సంస్థలు రుణాలు తీసుకున్న బ్యాంకులకు 15 ఏళ్ల పాటు ప్రభుత్వం నుంచి సమయానికి చెల్లింపులు జరిగేలా సదరు నోడల్ ఏజెన్సీ పర్యవేక్షిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం చెల్లింపులు చేయడంలో విఫలమైతే ఆ విషయాన్ని సదరు ఏజెన్సీ ఆర్బీఐకి చేరవేస్తుంది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించాల్సిన రుణం మొత్తాన్ని ఆర్బీఐ చెల్లిస్తుంది. ఆ నిధులను కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధుల నుంచి తిరిగి జమ చేసుకుంటుంది. ఈ విధానంతో హ్యామ్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి