04-01-2026 01:11:25 AM
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : ఈ రాష్ట్రం కోసమే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన కేసీఆర్.. తెలంగాణకు వరప్రదాయిని అయిన కృష్ణా జలాలను ఏపీకి ఎలా తాకట్టు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సాగునీటి అంశంలో మేం తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుతుంటే.. ఏపీకి తాకట్టు పెట్టారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నదీ జలాలపై చదివినట్టు చదివితే నాలు గుసార్లు ఐఏఎస్ అయ్యేవారు అని, అంబేద్కర్ యూనివర్సిటీకి రికమెండ్ చేసి వారికి డాక్టరేట్ ఇప్పించాల్సిందేనని చెప్పారు.
కేసీఆర్‌కు గతంలో యజమాని అయిన చంద్రబాబు ముందు మాట్లాడటానికి భయం అయి ఉంటే జగన్‌మోహన్‌రెడ్డి సీఎం తర్వాత అయినా సమస్య పరిష్కారం చూపాల్సిందన్నారు. శనివారం అసెంబ్లీలో కృష్ణా జలాలపై స్వల్ప కాలిక చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వలసల జిల్లా పాల మూరు బిడ్డగా కరువు కష్టాలు, పేదరికం ఎలా ఉంటుందో నాకు పూర్తిగా తెలుసు అన్నారు. తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యా యం జరుగుతుందని, ఇందుకు కాంగ్రెస్ కారణమని కేసీఆర్ విమర్శించారని, గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పు డు ఎలా ఉపయోగపడతాయో, ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై తన అనుభవంతో సూచనలు ఇస్తారని అనుకున్నా మని తెలిపారు.
అందుకే కృష్ణా జలాలపై ఒకరోజు, గోదావరి జలాలపై ఒకరోజు సభలో చర్చిద్దామని ఆహ్వానించామని స్పష్టం చేశారు. కృష్ణా నదీ జలాలపై చర్చ కావాలని అడిగిన కేసీఆర్ సభ కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ శాసనసభకు ఒక పవిత్రత ఉందని, ఈ సభలో జరిగే చర్చలను, విషయాలను, అందులోని వాస్తవాలను ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో నమ్ముతారని పేర్కొన్నారు. ఎందుకంటే... ఇక్కడ అబ ద్ధానికి ఆస్కారం లేదని, మాటల గారడీలకు స్థానం లేదన్నారు.
ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలే తప్ప రాజకీయ ప్రయోజ నాలకు ఇది వేదిక కాబోదని వెల్లడించారు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ప్రాతినిధ్యానికి ప్రతిరూపం ఈ సభ అని, ఈ సభలో మాట్లాడే ప్రతిమాట రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఉంటుందన్న నమ్మకం ప్రజల్లో ఉంటుందని చెప్పారు. గడిచిన రెం డేళ్లుగా ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదని, సభకు రావాలని నేను పదే పదే విజ్ఞప్తి చేశానని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే ప్రధాన ప్రతిపక్ష నేత సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
సభలోకి రాబోమని, చర్చలో పాల్గొనమని హరీశ్‌రావు మాట్లాడటం చట్టసభలను అవమానించడమే అన్నారు. మీరు సభ పెట్టండి మీ బట్టలు ఊడదీస్తామన్నామని, తోలు తీస్తామని కేసీఆర్ మాట్లాడారని, వారు సభలో చర్చలో పాల్గొని ఉంటే ఎవరి బట్ట లు ఎవరు ఊడదీస్తారు.. ఎవరి తోలు ఎవ రు తీస్తారు అనేది తెలంగాణ ప్రజలకు తెలిసేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ పట్ల మా చిత్తశుద్ధి ప్రశ్నిస్తే నాలుక కోస్తా..
ఎవరు కూడా 11 శాతం వడ్డీ రేటుకు అప్పులు తీసుకురారని, మేం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి వడ్డీరేటు తగ్గించామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు పరిశ్రమలు రావాలనే ఉద్దేశం వారికి లేదని, జూరాల నుంచి శ్రీశైలం వద్దకు ప్రాజెక్టును మార్చి లిఫ్ట్‌లు, పంపులు పెంచడం ద్వారా కాంట్రాక్టర్లకు వేల కోట్ల ఇచ్చి వాటిని ఇద్దరు పంచుకున్నారని ఆరోపించారు.
భాష విజ్ఞానం కాదని, మెస్సీకి ఏం ఇంగ్లిషు రాదని, ఆయనకు ఆట మాత్రమే వస్తుందన్నారు. పాలకునికి కూడా పరిపాలన వస్తే చాలన్నారు. ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి ఉందన్నారు. చంద్రబాబుతో కొట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపానని వెల్లడించారు. నాకు మొదట ప్రాంతం, తర్వాత పార్టీ ఆ తర్వాతనే ఏ నాయకుడైనా అని స్పష్టంచేశారు. ఇంతటి అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు సాగునీటి విషయంలో ద్రోహం చేస్తానా అని ప్రశ్నించారు. తెలంగాణ నీళ్ల విషయంలో, అభివృద్ధి విషయంలో మేమంతా ఏకాభిప్రాయంతో పనిచేస్తామని, తెలంగాణ రావాల్సిన నీటి హక్కుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు.
చచ్చినా తెలంగాణ కోసం చస్తాం.. బతికినా తెలంగాణ కోసం బతుకుతాం.. ప్రాణమున్నంత వరకు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తామని ప్రకటించారు. తెలంగాణ పట్ల మా చిత్తశుద్ధిని ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక కోస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేయాలన్నదే నా ఆలోచన అని, దేవుడి మీద ఆన నేను ఈ కుర్చీలో ఉన్నంత కాలం తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనీయనని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
మరణ శాసనం రాశారు..
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్పప్పుడే అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో వీలైనన్ని సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేసిందని, 2005 నుంచి 2014 నాటికే కృష్ణా బేసిన్‌లో ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, మక్తల్ నారాయణపేట కొడంగల్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు చేపట్టిందని గుర్తు చేశారు. 2014లో అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్ ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాల్సిందిపోయి అసంపూర్తిగా వదిలేసిందని విమర్శించారు.
490 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేటాయిస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్, హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టాక తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015 జూన్‌లో జరిగిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో 299 టీఎంసీలకు అంగీకరించారని, ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలల్లో తెలంగాణకు 490 టీఎంసీలు అడగాల్సిందిపోయి 299 టీఎంసీలకు ఒప్పుకుని సంతకం పెట్టారని మండిపడ్డారు.
21-09-2016న జరిగిన అపెక్స్ మీటింగ్ లోనూ మనకు 299 టీఎంసీలు చాలు అని కేసీఆర్ తాత్కాలిక నీటి వాటాలకు ఒప్పుకొని వచ్చారని, 06-10-2020లో జరిగిన రెండో అపెక్స్ మీటింగ్ లోనూ ఈ కేటాయింపులే కొనసాగించాలని శాశ్వతంగా ఒప్పుకొని వచ్చారని గుర్తు చేశారు.
‘పాలమూరు’కు కేసీఆర్‌కు ఇసుమంతైనా సంబంధం లేదు
కృష్ణా జలాలపై బహిరంగ సభలు కాదు.. సభలోనే చర్చించాలని మేం కేసీఆర్, హరీశ్‌రావును ఆహ్వానించామని, పదేళ్లు కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోయేందుకు సహకరించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. వివరాలతో సభలో చర్చిద్దామంటే సభకు రాకుండా వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేసీఆర్‌కు ఈసమంతైనా సంబంధం లేదని, ఈ ప్రాజెక్టు కట్టాలని మొట్ట మొదట 2009లో ఆనాటి ఎంపీ విఠల్ రావు వైఎస్ రాజశేఖరరెడ్డికి లేఖ రాశారని, చరిత్రలో పాలమూరు రంగారెడ్డికి ఎలా పునాదులు పడ్డాయో తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర నాయకులతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొట్లాడి పాలమూరు రంగారెడ్డిని సాధించుకున్నారని, ఆ సమయంలో మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల ఇవ్వాలని అడగలేదని చెప్పారు. ఏ నైతిక హక్కుతో కేసీఆర్ ఇవాళ మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల వరద జలాలను మళ్లించి సాగునీటిని అందించేందుకు పాలమూరు ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రం ఆమోదం తెలిపిందని, జూరాల నుంచి 70 టీఎంసీల వరద జలాలతో పాలమూరు ప్రాజెక్టు సర్వేతో పాటు డీపీఆర్ తయారు చేయాలని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా వాళ్లకు ఈ జీవో ద్వారా బాధ్యతలు అప్పగించిందని గుర్తుచేశారు.
జూరాల సోర్స్‌గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించాలని ఆనాడు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ ఫోరానికి చెందిన నిపుణులు, ఇంజనీర్లు సూచించారని, 26 రోజుల తర్వాత ఈ ప్రాజెక్టును కేసీఆర్ పథకం ప్రకారం డైవర్ట్ చేశారని ఆరోపించారు. జూరాల నుంచి కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సోర్స్‌ను శ్రీశైలం నుంచి మార్చాలని ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు. జూరాల వద్ద నిర్మిస్తే పంపులకు రూ. 5,185 కోట్లు అంచనా వేస్తే సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి పంపులు, లిఫ్టుల సంఖ్య పెంచారని, 37 పంపులకు 10,335 కోట్లకు అంచనాలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.