ఏప్రిల్ 2 నుంచి ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభలు
జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
రంగారెడ్డి, మార్చి 31 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా, ఏప్రిల్ 2వ తేదీ నుండి జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న గ్రామ మరియు వార్డు సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభలు ఉదయం 10 గంటలకు పాఠశాలలు, పంచాయతీ భవనాలు లేదా అనువైన బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని సభ ను రాష్ట్ర గీతంతో ప్రారంభించి, సీఎం సందేశాన్ని మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చదివి వినిపించాలని చెప్పారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలకు ముందస్తు సమాచారం అందించి, వారిని భాగస్వామ్యం చేయాలని, వేసవి ని దృష్టిలో పెట్టుకొని షామియాలను వేసి తాగునీరు అందుబాటులో ఉంచడంతోపాటు మహిళలు మరియు వృద్ధులకు ప్రత్యేక కూర్చునే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్‌ఓ సంగీత, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణ రెడ్డి మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




