విద్యార్థుల్లో ప్రజాస్వామ్య చైతన్యం
సిరికొండలో మాక్ పార్లమెంట్ విజయవంతం
సిరికొండ, మార్చి 31 (విజయకాంత్రి): సిరికొండలోని పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమం విద్యార్థుల్లో ప్రజాస్వామ్య అవగాహనను పెంపొందిస్తూ ఘనంగా జరిగింది. విద్యార్థులు నిజమైన పార్లమెంట్ సమావేశాన్ని తలపించేలా చర్చలు, ప్రశ్నోత్తరాలతో కార్యక్రమాన్ని చైతన్యవంతంగా మార్చారు. ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ రవీందర్ ప్రారంభించగా, సబ్‌ఇన్స్పెక్టర్ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు.
సభలో విద్యార్థులు అధికార, ప్రతిపక్ష పాత్రలను పోషిస్తూ సమాజానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవల విస్తరణ, మహిళల భద్రత, అంతర్జాతీయ పరిణామాలు వంటి అంశాలపై ప్రశ్నలు సంధిస్తూ, సమాధానాలు ఇచ్చి తమ విశ్లేషణాత్మక ఆలోచనను ప్రదర్శించారు.
కార్యక్రమం ఉద్దేశాలను వివరిస్తూ పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, వాదన సామర్థ్యం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రాయోగిక అవగాహన కల్పించడం ద్వారా బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా అతిథులు విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, వారి చర్చా పద్ధతి, ఆత్మవిశ్వాసం ప్రశంసనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మీడియా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




