26-07-2025 11:15:10 PM
అధికారులతో ప్రత్యేక అధికారి హరికిరణ్ సమీక్ష..
నిర్మల్ (విజయక్రాంతి): వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్(District Special Officer Harikiran) ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav)తో కలిసి ఆయన రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ, జిల్లాలో లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. మ్యాన్‌హోల్స్, డ్రైన్లు, చెరువులు, ప్రాజెక్టుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. వర్షాకాలంలో చెరువుల వద్ద చేపల వేటకు ప్రజలు వెళ్లకుండా అవగాహన కల్పించాలని అన్నారు.
విద్యుత్ ప్రమాదాలపై ప్రజలకు హెచ్చరికలు ఇవ్వాలని, ఆడియో ద్వారా గ్రామాల్లో ప్రచారం చేయాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. ఎరువుల వినియోగంపై పర్యవేక్షణ ఉండాలని, యూరియాను వ్యవసాయానికి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.రేషన్ కార్డుల పంపిణీ ప్రజాప్రతినిధుల సమన్వయంతో షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 24x7 కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించామని తెలిపారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.