మృతదేహాలను భద్రపరచండి
- చూసేందుకు బంధువులను అనుమతించండి
- ఎన్‌కౌంటర్‌పై రాతపూర్వక వివరణ ఇవ్వండి
- ఏటూరునాగారం ఎస్‌హెచ్‌వోకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను మంగళవారం వరకు భద్రపరచాలని ఏటూరు నాగారం ఎస్‌హెచ్‌వోకు సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
అదేవిధంగా మృతదేహాలను చూడటానికి పిటిష నర్‌తోపాటు బంధువులను అనుమతించాలని సూచించింది. ఎన్‌కౌంటర్‌పై రాతపూ ర్వక వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఎన్‌కౌంటర్ బూటకమని, దర్యాప్తు జరిపించాలని మృతుడు మల్లయ్య భార్య కే ఐలమ్మ అలియాస్ మీనా సోమవారం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సురేష్‌కుమార్ వాదనలు వినిపిస్తూ ఇది ఎన్‌కౌంటర్ కాదని, మావోయిస్టులను పోలీసులు ప్రాణాలతో తీసుకెళ్లి కాల్చిచంపారని అన్నారు. విషాహారం పెట్టి, స్పృహ కోల్పోయాక వారిని చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. అనంతరం శరీరంలోకి పోలీసులు బుల్లెట్లు దింపారని చెప్పారు.
ఒకరి ముంజేతిపై యాసిడ్ గాయాలున్నాయని, దుస్తులపై తెల్లటి పొడి ఉందని పేర్కొన్నారు. మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న పిటిషనర్.. తన భర్త మృతదేహాన్ని ఉంచాలని పోలీసులను ఈ ద్వారా కోరినట్టు తెలిపారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్టు ములుగు ఎస్పీ పేర్కొనడం అవాస్తవమని అన్నారు.
సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం ఎన్‌కౌం టర్ జరిగినపుడు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేయాల్సి ఉందని చెప్పారు. ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులే విచారణ జరిపి నిర్ణయాన్ని వెలువరించడం సరికాదన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్ కాని పక్షంలో పోలీసులు హడావుడిగా రాత్రికి రాత్రే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కాల్చివేయాలని ఎందుకు ప్రయత్నించారని అడిగారు.
మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులతో కూడిన డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం నిర్వహించాలని కోరారు. కేసు దర్యాప్తుకు మృతదేహం కీలకమని, బాడీతోపాటు దుస్తులను భద్రపరిచేలా ఆదేశాలి వ్వాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది మహేష్‌రాజ్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే పోస్టుమార్టం పూర్తయిందని తెలిపారు.
నిబంధనల ప్రకారం నిపుణలైన డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం నిర్వహించామని చెప్పారు. పోస్టుమార్టం సమయంలో పిటిషనర్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. భర్త మృతదేహాన్ని చూడటానికి పిటిషనర్‌ను అనుమతించినట్టు స్పష్టంచేశారు. శాంతిభద్రతల సమస్యల వల్ల మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించడం సాధ్యం కాదని చెప్పారు.
వాదనలను విన్న న్యాయమూర్తి శాంతిభద్రతల నేపథ్యంలో మృతదేహాలను వరంగల్ ఆస్పత్రికి తరలించాలంటూ ఆదేశాలివ్వలేమని పేర్కొన్నారు. వీటిని భద్రపరచాలని ఏటూరు నాగారం ఎస్‌హెచ్‌వోకు ఆదేశాలు జారీ చేశారు.






