10 April, 2026 | 9:48 AM

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతిఒక్కరి బాధ్యత

03-01-2026 12:00 AM

ఎస్పీ కె. నరసింహ

సూర్యాపేట, జనవరి 2 (విజయక్రాంతి) : రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, రోడ్డు రవాణా సంస్థ, రాష్ట్ర రోడ్ సేఫ్టీ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో జనవరి నెలలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జనవరి 31 వరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించి, రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ప్రజలంతా చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయని, ఏ ఒక్క కుటుంబం కూడా రోడ్డు ప్రమాదాల కారణంగా తమ ఆత్మీయులను కోల్పోవద్దన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

ఆ ప్రణాళిక ప్రకారం జిల్లా పోలీస్ సిబ్బంది గ్రామాలు, పట్టణాలు, కాలనీలు, విద్యాసంస్థలు, కమ్యూనిటీ కేంద్రాలు, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలు, ప్రమాదకర జంక్షన్లు, జనసమ్మేళన ప్రాంతాల్లో రోడ్డు భద్రత, డిఫెన్సివ్ డ్రైవింగ్, అరైవ్ అలైవ్ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగే కారణాలు, నివారణ మార్గాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.