17-02-2026 12:36:23 AM
కుషాయిగూడ, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): 2022లో సంచలనం సృష్టించిన మల్కాజిగిరి సిద్ధివినాయక దేవస్థాన మహిళ హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. ప్రధాన నిందితుడు పూజారి అనుముల మురళీకృష్ణను దోషిగా నిర్ధారించిన కోర్టు సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మల్కాజిగిరి విష్ణుపురి కాలనీలోని సిద్ధివినాయక దేవస్థానంలో 57 ఏళ్ల మహిళ బంగారు ఆభరణాలతో దర్శనానికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది.
ఆలయంలోనే ఆమెను హత్య చేసి, ధరించిన బంగారు ఆభరణాలను అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆ ఆభరణాలను విక్రయించిన ఆధారాలను పోలీసులు సేకరించారు. కేసును సమగ్రంగా విచారించిన న్యాయమూర్తి డి.కిరణ్ కుమార్ సమర్పిత సాక్ష్యాలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించి నిందితుడిని దోషిగా తేల్చారు. ఈ తీర్పుతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్లు పోలీసులు తెలిపారు.