calender_icon.png 6 July, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్జెంటీనాలో ప్రధాని మోదీ

06-07-2025 12:53:23 AM

- బ్యూనస్ ఎయిర్స్‌లో ఘన స్వాగతం

- ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిలైతో భేటీ

- పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు

బ్యూనస్ ఎయిర్స్, జూలై 5: ఐదు దేశాల పర్యటనలో భాగంగా అర్జెంటీనాకు చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడ ఘనస్వాగతం లభించింది. 57 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంతరం భారత ప్రధాని అర్జెంటీనాలో ద్వైపాక్షిక పర్యటన చేయడం ఇదే తొలిసారి. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది.

మోదీకి ఇరువైపులా నిలబడిన ఆ దేశ సైనికులు కవాతు నిర్వహించారు. అనంతరం వారి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత మోదీ బస చేసిన అల్వియర్ ప్యాలెస్ హోటల్ వద్దకు ప్రవాసీయులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ‘మోదీ.. మోదీ.. జైహింద్.. భారత్ మాతాకీ జై ’అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడి నుంచి నేరుగా బ్యూనస్ ఎయిర్స్‌లోని అధ్యక్షుడి భవనానికి చేరుకున్న మోదీ ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిలైతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మోదీని జేవియర్ ఆలింగనం చేసుకోవడం విశేషం. అనంతరం ప్రధాని మోదీతో జేవియర్ పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 2024లో భారత్‌తో పాటు అర్జెంటీనా కూడా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాయని గుర్తు చేసుకున్నారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా రక్షణ, వ్యవసాయం, మైనింగ్, గ్యాస్, సాంప్రదాయేతర ఇంధన వనరులు, ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు మొదలైన అంశాలపై చర్చించారు.

కాగా అర్జెంటీనాకు భారత్ ఐదో అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. చివరగా 1968లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ అర్జెంటీనాలో పర్యటించారు. అర్జెంటీనా పర్యటన అనంతరం మోదీ నేరుగా బ్రిక్స్ సదస్సు జరగనున్న బ్రెజిల్‌కు వెళ్లనున్నారు.