16-10-2025 11:48:23 AM
డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుపైకి.
బొలెరోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.
మణికొండ,విజయక్రాంతి: హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు భయానక వాతావరణం సృష్టించింది. అతివేగంతో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టి, అవతలి వైపు రోడ్డులోకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన గురువారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్(Rajendranagar Police Station) పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డివైడర్‌ను దాటి అవతలి వైపునకు దూసుకెళ్లడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం కారణంగా ఔటర్ రింగు రోడ్డుపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. డ్రైవర్ మితిమీరిన వేగంతో బస్సును నడపడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.