ఉపాధి హామీ డబ్బులు రాక ఇబ్బందులు
కన్నాయిగూడెం, మార్చి4 (విజయక్రాంతి) : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో సంవత్సరం కితం ఉపాధి హామీ పనులను నిర్వహించిన కూలీలకు ఏడాది గడుస్తున్నా డబ్బులు రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని కన్నాయిగూడెం మండలంలో ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం మండల నాయకులు కోరం చిరంజీవి అన్నారు.
ఆదివాసి గిరిజన సంఘ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలు సర్వే చేయడం జరిగిందని, ఆయా గ్రామాలలో గత సంవత్సరం నుంచి ఉపాధి హామీ పని చేసిన కూలీలకు ఇప్పటివరకు పైసలు రాక ప్రజలు అధికారులకు చెప్పిన గాని ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఉపాధి హామీ పని పైసలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఓ సమస్యలను ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు.
ప్రభుత్వాధికారులకు నెలనెల జీతాలు పొందుతూ, రెక్కల కష్టంతో జీవించే కూలీలకు సకాలంలో ఉపాధి పనుల వేతనాలు చెల్లించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న కూలీలకు వేదనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.




