అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, మార్చి 4 (విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు బొజ్జ సునీత తిరుపతి దంపుతుల గృహప్రవేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో చొప్పదండి నియోజకవర్గంలో రెండేళ్లలోనే అర్హులైన లబ్ధిదారులకు 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మందికి ఇందిరమ్మ ఇండ్లను అందజేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని పేర్కొన్నారు.
గత బిఆర్‌ఎస్ పాలనలో నిరుపేదల కోసం ఒక్కటంటే ఒక్కటి కూడా కట్టించలేదని గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో నాటి కెసిఆర్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇండ్లు రాణి నిరుపేదలు ఆందోళన చెందవద్దని, రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.




