బాధను అనుభవిస్తేనే భావోద్వేగ ప్రేమకథలు రాయగలం
కొబ్బరిమట్ట, హృదయకాలేయం, కలర్ ఫొటో, బేబి వంటి చిత్రాలతో స్టోరీ రైటర్‌గా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు సాయి రాజేశ్. ఆయన కథను అందించి, నిర్మాత ఎస్‌కేఎన్‌తో కలిసి నిర్మించిన తాజాచిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రేక్షకాదరణతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లను దాటి రెండో వారంలోనూ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం సాయిరాజేశ్ విలేకరులతో సమావేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమా విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
‘హృదయకాలేయం’, ‘కొబ్బరిమట్ట’ సినిమాల సమయంలో డైరెక్టర్‌గా నా పేరు స్టీవెన్ శంకర్ అని పెట్టుకున్నా. స్టీవెన్ స్పీల్ బర్గ్‌లోని స్టీవెన్, శంకర్‌లోని శంకర్ తీసుకున్నదే స్టీవెన్ శంకర్. దర్శకుడిగా ప్రచార కార్యక్రమాల్లో నేను బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉండేది. అమ్మానాన్నలు పెట్టుకున్న పేరుతోనే మన కెరీర్ కొనసాగించాలని అనుకుని ‘కలర్ ఫొటో’ టైమ్‌లో సాయిరాజేశ్‌గా క్రెడిట్స్‌లో పేరు వేసుకున్నా. ప్రేక్షకులు స్టీవెన్ శంకర్ అనే పేరును మర్చిపోయారా అనుకునే టైమ్‌లో మా ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాలో హీరో కిరణ్ క్యారెక్టర్‌కు స్టీవెన్ శంకర్ అని పెట్టుకోవడం కలిసొచ్చింది. దీంతో ఇంకొంతకాలం ప్రేక్షకులు స్టీవెన్ శంకర్ పేరు గుర్తుపెట్టుకుంటారు.
చెన్నై లవ్ స్టోరీ సినిమాకు మొదటి రెండు రోజులు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరిగింది. వాకౌట్ అనే ప్రచారం చేశారు. నిజంగా ప్రేక్షకులు వాకౌట్ చేస్తే 50 కోట్ల రూపాయల వసూళ్లు దక్కవు కదా. బేబి సినిమా చూశాక కొందరు వైష్ణవి క్యారెక్టర్‌ను విమర్శించారు. విరాజ్ క్యారెక్టర్‌లో క్లారిటీ లేదన్నారు. అలా విమర్శలు వచ్చాయి కానీ ‘చెన్నై లవ్ స్టోరీ’ విషయంలో కిరణ్‌కు గానీ, గౌరి క్యారెక్టర్స్ విషయంలో ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ రాలేదు.
-షూటింగ్ టైమ్‌లో ఈ మూవీలోని కొన్ని సీన్స్ చూశాక దర్శకుడిగా రవి పనిలో నేను ఏమాత్రం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు అనిపించింది. ఇంటర్వెల్ సీన్ చూశాక నాకంటే ఈ సినిమాను తను బాగా రూపొందించాడనే ఫీల్ కలిగింది. చెన్నై లవ్ స్టోరీ సినిమాను కంఫర్ట్‌గా రిలీజ్ చేసుకున్నాం. కలెక్షన్స్ నుంచి ప్రొడ్యూసర్స్‌కు డబ్బులు రావాలంటే కొంత టైమ్ పడుతుంది. ప్రస్తుతానికి పేపర్స్‌పైన లెక్కలను చూస్తే మేము లాభాల్లోనే ఉన్నాం.
కథపరంగా కలర్ ఫొటో, బేబి కంటే నాకు ఎక్కువ సంతృప్తినిచ్చిన చిత్రమిది. మనకు తెలిసి చాలా తక్కువ చిత్రాలు ఇలాంటివి వచ్చి ఉంటాయి. మా సినిమాలో కొన్ని సీన్స్ చూస్తే ‘మౌనరాగం’ చిత్రానికి ట్రిబ్యూట్ ఇచ్చామని మీకు అర్థమవుతుంది. నిజ జీవితాల్లోనుంచే ఇలాంటి కథలు వస్తుంటాయి. వ్యక్తిగత జీవితంలో బాధను అనుభవించినప్పుడే భావోద్వేగభరితమైన ప్రేమకథలు రాయగలం. నా లైఫ్‌లోనూ పెయిన్ అనుభవించాను. అయితే నా లవ్ స్టోరీ సక్సెస్ అయ్యింది. కలర్ ఫొటో సినిమా అయితే చివరి 30 నిమిషాలు తప్ప సీన్ టు సీన్ నా ఇంటర్మీడియట్ లైఫ్‌లో జరిగిందే. మరొక ప్రేమకథ ఉంది. అది తెరకెక్కించడం నా డ్రీమ్. అది పూర్తయ్యాక మరో జానర్ మూవీస్ చేస్తా.
-నేను దర్శకుడిగా కెరీర్ బిగిన్ చేసినప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్ వేరు. కేవలం స్టార్స్, బ్యానర్ వ్యాల్యూ ఉన్న చిత్రాలకే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపించేవారు. కొత్త వాళ్ల సినిమాలు నిలబడటం కష్టంగా ఉండేది. అందుకే ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి. అందరూ మాట్లాడుకునే టాపిక్ కావాలని ‘హృదయకాలేయం’ చిత్రంతో నా కెరీర్ మొదలుపెట్టా. ఇప్పుడున్నట్లు కంటెట్ ఓరియెంటెడ్ సినిమాలకు ఆదరణ అపపుడు ఉండి ఉంటే ‘కలర్ ఫొటో’తోనే నా జర్నీ ప్రారంభించేవాడిని. అప్పటికి నా దగ్గర కలర్ ఫొటో, బేబి స్టోరీ లైన్స్ ఉన్నాయి.
-చెన్నై లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి ఛేంజెస్ చేయలేదు. దర్శకుడిగా నాకు కొంత గ్యాప్ వచ్చిన మాట నిజమే. అయితే బేబి హిందీ రీమేక్ వర్క్స్‌లో బిజీగా ఉండిపోవడం వల్ల దర్శకుడిగా మరో సినిమా చేయట్లేదు. అయితే రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నా. నా కథను బాగా తీయగల దర్శకుడు ఉంటే అవకాశం ఇస్తా. అందువల్ల నిర్మాతగా నేను కూడా బెనిఫిట్ పొందుతాను. నా కథ ఒక మంచి సినిమాగా ప్రేక్షకుల దగ్గరకు వెళ్తుంది. ఈ చిత్రంలోని పాత్రకు భాగ్యరాజాని అనుకున్నాం. ఆయనతో నేను ఫోన్‌లో మాట్లాడాను. అయితే డేట్స్ క్లాష్ వల్ల ఆయన నటించలేకపోయారు. భాగ్యరాజాను కలిసి ఉంటే బాగుండేదనే ఫీల్ అయితే ఉంది.
-ఇళయరాజా, కీరవాణి, మణిశర్మ వంటి గొప్ప దర్శకులతో పనిచేయాలని అందరు దర్శకులకూ ఉంటుంది. నేను, మణిశర్మ, ఇళయరాజా అభిమానులం. ఒక రోజంతా రాజా పాటలు వింటూ అలాంటి మ్యూజిక్ మన మూవీకి చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇళయరాజా పాటల మీద నాకున్న అవగాహనకు మణిశర్మ సంతోషించారు.
-బేబి సినిమా దర్శకుడిగా నా అస్తిత్వానికి పరీక్ష. ఆ సినిమా సక్సెస్ లేకుంటే నేను లేను, చెన్నై లవ్ స్టోరీ సినిమా లేదు. బేబి మా అందరికీ మానసికంగా ఎంతో దగ్గరైన మూవీ. అప్పటికి ఉన్న పరిస్థితుల్లో సాయి రాజేశ్ దర్శకత్వం చేయగలడా లేదా అనే సందేహాలను చెదరగొట్టింది.
బేబి హిందీ రీమేక్ మరో 20 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. సెప్టెంబర్ చివరికల్లా షూటింగ్ కంప్లీట్ చేస్తాం. తెలుగులో క్యారెక్టర్స్ సాఫ్ట్‌గా ఉంటే హిందీ బేబిలో అగ్రెసివ్‌గా ఉంటాయి. రైటర్‌గా ఎమోషనల్ పెయిన్ తీసుకోవాలి. దర్శకుడిగా ఇంకా ఎక్కువ కష్టపడాలి. నాకు ఎస్ కేఎన్, ధీరజ్ లాంటి స్నేహితులు ఉన్నారు కాబట్టి ప్రొడక్షన్ సులువు అనుకుంటా. మా సినిమా బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల మార్క్ టచ్ కావాలని ఆశించాం. మేము ఆశించినట్లే ప్రేక్షకులు మంచి వసూళ్లు ఇచ్చారు.
మా సినిమా విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి నాకు మెసేజ్ పంపారు. మరోసారి 50 కోట్ల గ్రాసర్ మూవీ చేశారని అభినందించారు. తన అభిమానులు ఇలాంటి మంచి విజయాలు సాధించడం గర్వంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి మెసేజ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అల్లు అర్జున్ ఈ వారంలోనే మా మూవీ చూడబోతున్నారు. దర్శకుల సంఘానికి గతంలో వైస్ ప్రెసిడెంట్‌గా చేశాను, ఇప్పుడు ట్రెజరర్‌గా ఉన్నా. ఇటీవల ఫిలిం ఫెడరేషన్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు. ఈ పదవులన్నింటినీ బాధ్యతగా భావిస్తున్నా. కనీస వేతనాల విషయంలో ప్రొడ్యూసర్స్ నుంచి ఒప్పందాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నాను కాబట్టి కార్మికుల పక్షాన్నే పనిచేస్తా.
నేను ముళ్లపూడి, యండమూరి వంటి రచయితలను అభిమానిస్తాను. బాలచందర్ సినిమాల్లో ఉండే గ్రే క్యారెక్టర్స్ నన్ను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. ఈ ఏడాది అక్టోబర్ తర్వాత నా దర్శకత్వంలో తెలుగు సినిమాను ప్రకటిస్తాను.






