calender_icon.png 7 August, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీలక అంశాలతో నిర్మాతల ప్రతిపాదనలు

07-08-2025 01:19:46 AM

నేడు ఎఫ్‌డీసీ చైర్మన్, మంత్రిని కలువనున్న కార్మిక నాయకులు  

సినిమా ప్రతినిధి, ఆగస్టు ౬ (విజయక్రాం తి): సినీకార్మికుల సమ్మె కారణంగా టాలీవుడ్‌లో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సమ్మెలో మూడోరోజైన బుధవారం నిర్మా తల మండలి నాలుగు కీలక అంశాలను ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌కు  ప్రతిపాదించింది. కాల్షీట్ వేళల్లో మార్పులు, నాన్ మెంబర్లను పనిలోకి తీసుకోవటంపై చర్చించారు. ఆదివారం సింగిల్ కాల్షీట్, ఫైటర్లు, డ్యాన్సర్లను తీసుకోవటంపైనా చర్చ జరిపారు.

ఇదిలా ఉండగా ఫెడరేషన్ నాయ కులు కార్మిక సంఘాలతో అత్యవసర సమా వేశం నిర్వహించింది. నిర్మాతల ప్రతిపాదన లపై చర్చించేందుకు గురువారం  ఫిల్మ్ చాంబర్‌కు వెళ్లాలని నిర్ణయించారు. వేత నాల పెంపు, రోజువారీ చెల్లింపులకు అంగీక రిస్తే షూటింగులకు హాజరు కావాలని సూచించింది. ఈ విషయమై గురువారం ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుతో సమావేశం కావాలని నిర్ణయించారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటరెడ్డి వెంకట్‌రెడ్డిని సైతం కలవాలని నిర్ణయించారు. 

ఎక్కువ సినిమాలు చేయాలి: బాలకృష్ణ

నటుడు బాలకృష్ణను బుధవారం ప్రత్యేకం గా కలిశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్ కు ‘అఖండ2’ సినిమా డబ్బింగ్ కోసం వచ్చిన బాలకృష్ణను నిర్మాతలు మైత్రీ రవి, గోపినాథ్ ఆచంట, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, కార్యదర్శి దామోదర ప్రసాద్ కలిశారు. ఫెడరేషన్ డిమాండ్లు, యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాలను వివరించారు.

అనంతరం నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మీడియాతో మాట్లా డుతూ.. ‘ప్రతి హీరో సంవత్సరానికి ఎక్కువ సినిమాలు చెయాలని బాలకృష్ణ చెప్పారు. ఏడాదికి 4 సినిమాలు చేస్తానన్నారు. అవసరం మేరకే కార్మికులను తీసుకోవాలని, వర్కింగ్ డేస్ ఎంత తక్కువ అయితే అంత మంచిదని చెప్పారు. కార్మికులు కూడా పరిశ్రమలో భాగమేనని, సమస్య పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని బాలకృష్ణ హామీ ఇచ్చారు’ అని ప్రసన్నకుమార్ వివరించారు. 

ప్రభుత్వాలతో పనిలేదు: నిర్మాత కల్యాణ్ 

సినీకార్మికుల వేతనాలు పెంచాలంటూ డిమాండ్ చేస్తూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమ్మెకు దిగటంతో పరిశ్రమ మొత్తం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ విషయమై మాట్లాడిన ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేతనాల పెంపు అంశంపై ప్రభుత్వ జోక్యం అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఇలాంటి సందర్భాలు ఎదరైనప్పుడు దాసరి నారాయణరావు లాంటి పెద్దలు జోక్యం చేసుకొని పరిష్కరించారు.

ఇప్పుడు ఎంతోమంది హీరోలు, ప్రముఖులు ఇండస్ట్రీలో ఉన్నారు. సినిమా వాళ్లకు ప్రభుత్వాలతో పనిలేదు.. సినిమా టికెట్ ధర పెంపు కోసం నిర్మాతలు వ్యక్తిగతంగా ప్రభుత్వాలను సంప్రదిస్తారు. సినీకార్మికుల్లో నైపుణ్యం లేదని కొందరు నిర్మాతలు వ్యాఖ్యానిస్తున్నారు.. అలా అనడం సరైంది కాదు’ అని సీ కల్యాణ్ అన్నారు. 

పనిచేసేందుకు తెలంగాణ ఫెడరేషన్ సిద్ధం: అధ్యక్షుడు వడ్డె కరుణాకర్‌రెడ్డి

సినీకార్మికుల సమ్మె మూడోరోజూ కొనసాగింది. ఈ నేపథ్యం లో బుధవారం తెలంగాణ సిని మా ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బాధ్యులు మీడియాతో మాట్లాడారు. అధ్యక్షుడు వడ్డె కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. “స్టుక్‌కు.. మా కార్మిక సమాఖ్యకు సంబంధమూ లేదు.  మా చాంబర్ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో అనుసంధానమై ఉంది. నిర్మాత మండలితోనే కలిసి పనిచేస్తాం.

తెలంగాణ ఫెడరేషన్‌లో అన్ని క్రాఫ్టుల వాళ్లూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు” అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రెటరీ మూర్తి, ట్రెజరర్ వీ ఠాగూర్, మేకప్ ఆర్టిస్టుల యూనియన్ ప్రెసిడెంట్ జీఆర్‌పీ రఘు, కార్పెంటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.