25-05-2025 12:00:00 AM
తెలుగు చిత్రసీమలో ఉన్నవారికి ఏపీ సర్కార్ పట్ల కనీస కృతజ్ఞత లేదని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతు న్నా తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమత్రిని మర్యాద పూర్వకంగా కలిశారా? అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం సినిమా రంగం వారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరిచిపోయారన్నారు. కూట మి ప్రభుత్వం వ్యక్తులను కాకుండా.. సినిమా రంగాభివృద్ధినే చూస్తోందని తెలిపారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
తమ డిమాండ్లు నెరవేర్చాలని లేకపోతే, జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ అంటూ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఫిల్మ్ చాంబర్‌లో జరిగిన సమావేశం తర్వాత అలాంటిదేమీ లేదని ప్రకటించిన నేపథ్యంలో పవన్‌కల్యాణ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
“ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, డీ సురేశ్‌బాబు, వై సుప్రియ, చినబాబు, సీ అశ్వనీదత్, నవీన్ యెర్నేని తదితరులు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చు’ అని చెప్పాను. అయినా, ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకు అర్జీలు ఇస్తూ వచ్చారు.
ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది. మీరిచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్‌ను తగినవిధంగానే స్వీకరిస్తా. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తా. వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తా” అంటూ పవన్‌కల్యాణ్ చిత్ర పరిశ్రమపై తన అభిప్రాయాన్ని ప్రకటన రూపంలో వెల్లడించారు.