calender_icon.png 25 May, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బయోపిక్‌ల ట్రెండ్ బ్రో!

25-05-2025 12:00:00 AM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు ప్రముఖుల బయోపిక్‌లను సినిమాలుగా రూపొందిం చారు. అలనాడు తెలుగు చిత్రసీమకే మహారాణిగా మారిన సావిత్రి జీవితాన్ని తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ‘మహానటి’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను కీర్తి సురేశ్ పోషించింది.

మరోవైపు నందమూరి తారక రామారావు బయోపిక్ కూడా సినిమా రూపంలో వచ్చింది. ఎన్టీఆర్ జీవితాన్ని రెండు భాగాల్లో తెరకెక్కించారు. దంగల్, ధోని, సచిన్, కిషోర్‌కుమార్, సంజయ్‌దత్, రాణి లక్ష్మీబాయి వంటివెన్నో బాలీవుడ్‌కు చెందిన బయోపిక్‌లుగా చెప్పవచ్చు. 

ఇటు కోలీవుడ్‌లోనూ బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే అక్కడ ఇళయరాజా బయోపిక్ ప్రకటించారు. సంగీత రంగంలో విశేష సేవలందిస్తున్న ఇళయరాజా జీవిత విశేషాలతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ధనుష్ టైటల్ రోల్ పోషిస్తున్నారు. మరోవైపు రజనీకాంత్ బయోపిక్‌ను కూడా రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు ధనుష్, దర్శకుడు శంకర్ పలు సందర్భాల్లో చెప్పారు.

ప్రఖ్యాత కర్ణాటక గాయనీమని మధురై షణ్ముఖ వడివు సుబ్బులక్ష్మి బయోపిక్ గురించి కూడా ఎన్నో రోజులుగా సీరియస్ టాక్స్ ఉన్నాయి. ఈ బయోపిక్ బెంగళూరుకు చెందిన ఓ ప్రొడక్షన్ హౌస్ ద్వారా రూపొందనుందని తెలుస్తోంది. ప్రముఖ సంగీత విద్వాంసురాలి చరిత్రను తరతరాలు గుర్తుపెట్టుకునేలా భారీ వ్యయంతో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారట.

ఎంఎస్ సుబ్బులక్ష్మి క్యారెక్టర్ కోసం చాలా మందిని పరిశీలించారు కూడా. ఇటీవల ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా ఆమె గెటప్‌లో విద్యాబాలన్ కనిపించారు. ఆ మహనీయురాలికి నివాళిగా తాను ఈ గెటప్ వేసుకున్నట్టు తెలిపారు. దీంతో ఈ బయోపిక్ టైటిల్ రోల్‌ను ఆమే నటిస్తోందా? అన్న టాక్ వినవస్తోంది. అంతేకాకుండా ఈ బయోపిక్ టైటిల్ రోల్ విషయంలో త్రిష కృష్ణన్, నయనతారతోపాటు రష్మిక మందన్న పేర్లు కూడా వినిపిస్తున్నాయి.  

రన్ మెషీన్.. విరాట్ కోహ్లి 

విరాట్ కోహ్లి.. ప్రపంచ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు. రన్ మెషీన్‌గా ప్రసిద్ధి చెందిన కోహ్లి సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. అందుకే ఆయన బయోపిక్ కూడా పట్టాలెక్కునున్నట్టు తెలుస్తోంది. ఇందులో రామ్‌చరణ్ నటి స్తాడంటూ కొంతకాలంగా ప్రచా రం జరిగింది.

అయితే ఇందులో కోలీవుడ్ హీరో శింబు నటిస్తున్నట్టు ఇటీవల ఓ ఇన్‌స్టా పోస్ట్‌తో క్లారిటీ వచ్చిందంటున్నారు సినీ అభిమానులు. ఈ పోస్ట్‌ను రీషేర్ చేసిన శింబు.. ‘నువ్వు నిజంగానే సింహానివి’ అంటూ కోహ్లిని ఉద్దేశించి కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో విరాట్ కోహ్లి బయోపిక్‌లో నటించేది శింబు అంటూ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. 

కాంతారావు బయోపిక్‌కు ప్రయత్నాలు.. 

ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తర్వాత ఆ రేంజ్‌లో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు కత్తి కాంతారావు. కత్తి యుద్ధ వీరుడిగా పేరు గాంచిన కాంతారావు చివరి రోజుల దాకా నటించారు. అలాంటి కాంతారావు బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్లు కూడా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ఆదిత్య.. కాంతారావు స్వగ్రామం గుదిబండకు వెళ్లి కొన్ని వివరాలను సేకరించారట. ఈ సినిమా ‘అనగనగా ఓ రాజకుమారుడు’ అనే పేరుతో రానుందని సమాచారం. 

ఏఎన్నార్ జీవితం డాక్యుమెంటరీ రూపంలోనే! 

అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ కూడా సినిమా తీస్తే బాగుంటుందని అక్కినేని అభిమానులు కోరుకున్నారు. అయితే ఈ విషయమై ఓ సందర్భంలో అక్కినేని నాగార్జున స్పందిస్తూ నాన్న జీవిత విశేషాలతో డాక్యుమెంటరీ తీస్తే ఉపయోగకరంగా ఉంటుందనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. దీంతో ఏఎన్నార్ జీవిత విశేషాలతో ఇక సినిమా రాదనే విషయం తేలిపోయింది. 

కలాం.. ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ 

తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో తమిళ స్టార్ ధనుష్ కొత్త సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది భారత మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్‌కు సంబంధించినది కావటం విశేషం. ‘కలాం’ అనే పేరుతో దీన్ని రూపొందిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీనికి ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనేది ట్యాగ్ లైన్.

‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ధనుష్ ఇందులో టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో అబ్దుల్ కలాం షాడో పిక్‌ను అణుబాంబు పేలుతున్నచోట డిజైన్ చేసి చూపించారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, టీ -సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నారు.

అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్, భూషణ్‌కుమార్, క్రిషణ్‌కుమార్ నిర్మాతలు. ఇందులో కలాం రామేశ్వరంలో పుట్టిన దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, రాష్ట్రపతిగా ఎలా ఎదిగారో అన్నీ చూపించనున్నారు. ధనుష్ ప్రస్తుతం తెలుగులో కుబేర సినిమాలో నటిస్తున్నారు. ఇది జూన్‌లో విడుదల కాగానే కలాం బయోపిక్‌ను పట్టాలెక్కించనున్నారు.   

పొలిటీషియన్లు, సినీ తారలు, క్రికెటర్ల జీవితాలను ఆధారంగా చేసుకొని సినిమా తీయడం అన్ని భారతీయ చిత్రసీమల్లో సాధారణమైపోయింది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో ఇప్పటికే పలువురు ప్రముఖుల జీవిత విశేషాలతో తెరకెక్కిన సినిమాలు వచ్చాయి. 

ఇప్పటికే పలు బయోపిక్‌లు వచ్చినా, ఇంకా చాలా మంది జీవిత విశేషాల సినిమాల కోసం ఎదురుచూస్తున్నవారు ఎందరో ఉన్నారు. సినీప్రియుల అభిరుచికి తగ్గట్టు మేకర్స్ బయోపిక్‌లపై దృష్టి సారిస్తున్నారు. అందుకే ఇప్పుడు పలు ఇండస్ట్రీల్లో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది.