calender_icon.png 27 July, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలువలతో కూడిన వృత్తి జర్నలిజం..

26-07-2025 11:49:02 PM

జర్నలిజం ఔన్నత్యాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి..

మీడియా సమావేశంలో తాళ్లూరి హరిబాబు..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): దేశంలో విలువలతో కూడిన వృత్తి జర్నలిజమని, సమాజానికి దిక్సూచి లాంటిదని, దాని ఔన్నత్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని యారో ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ తాళ్లూరి హరిబాబు అన్నారు. శనివారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొంతమంది జర్నలిస్టులు సమాజానికి దిశా నిర్దేశం చేస్తుంటే, మరి కొంతమంది జర్నలిస్టుల ముసుగులో అక్రమాలకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ మధ్యకాలంలో నిరుద్యోగ యువతకు తన వంతు బాధ్యతగా గుర్తించి ఏజెన్సీ ద్వారా యువకులకు ఉపాధి కల్పిస్తుంటే, గిట్టని వారు, మీడియా ముసుగు ధరించి బెదిరింపులకు పాల్పడుతున్నారని, డబ్బులు ఇవ్వకపోతే వ్యతిరేక కథనాలు రాయడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే పాల్వంచకు చెందిన ఓ విలేఖరి తనను లక్ష రూపాయలు ఇవ్వలని, లేనిపక్షంలో వ్యతిరేక కథనాలు రాస్తా అని బెదిరించాడన్నారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తూ, తన మనోభావాలను దెబ్బతీసే విధంగా, తన పరువుకు భంగం కలిగించే విధంగా, అవాస్తవాలతో కూడిన వరుస కథనాలు రాయడం జరిగిందన్నారు. దీనిపై మనోవేదనతో, తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని సదుద్దేశంతో జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశామని, వారి ఆదేశాల మేరకు సాక్షాదారాలను పరిశీలించిన పోలీసులు బెదిరింపులకు పాల్పడిన విలేకరిపై కేసు నమోదు చేశారన్నారు. ప్రభుత్వం ఈ కోవకు చెందిన జర్నలిస్టులపై కఠిన వైఖరి అవలంబించాలని, మీడియా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇటువంటి చర్యలను ఖండించాలని కోరారు.