ప్రోఫెసర్ జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయం
గంభీరావుపేట(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు గారి పద్మ అన్నారు. గురువారం జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో ఆయన అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించి ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని బలంగా చాటి చెప్పిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా జీవితాంతం పోరాడిన ఆయన ఆశయాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర నేర్పడిందని, నీళ్లు,నిధులు,నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించి హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేశారని సర్పంచ్ పద్మ అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎగదండి స్వామి, ప్రశాంత్, అర్జున్, ఈవో వినీల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.






