మహిళల ఉన్నతితోనే ప్రగతి
- వారి ఆర్థిక స్థితిని మార్చాలి
రాష్ట్ర మంత్రి సీతక్క
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సీతక్క తెలిపారు. మహిళా ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి సాధ్యపడుతుందన్నారు. రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ సీఈవో కాత్యాయనితో కలిసి మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. డిమాండ్ ఉన్న వ్యాపారాల్లోనే సంఘాలకు ప్రోత్సాహం ఇస్తున్నామని తెలిపారు. స్థానికంగా లభ్యమయ్యే వస్తువులు ఆధారంగా వ్యాపారం చేస్తే అద్భుతాలు సాధిం చగలమన్నారు.
ఆధార్ కేంద్రాలు, మీ సేవ సెంటర్లు, పౌల్ట్రీ, డెయిరీ వ్యాపారా లు, క్యాంటీన్లు, స్టార్టప్ కంపెనీలు ఏర్పా టు చేసేలా మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పర్యాటక కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ రహదారులు, రద్దీ ప్రాంతాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కల్తీ భయంతో బయట తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారన్న మంత్రి పాలను కూడా కల్తీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల స్కూల్ యూని ఫామ్‌లను సకాలంలో అందించి మార్పు చూపించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చిన డీఆర్‌డీవో, అధికారులు మంత్రి అభినందించారు.
అదే స్ఫూర్తితో మహిళా శక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ మహిళల ఆర్థిక స్థితిగతులను మార్చి వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పాలనలోనే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఏర్పాటయిందని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. వడ్డీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపుల నుంచి మహిళలకు విముక్తి కల్పించేందుకే మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను ప్రభుత్వం కల్పిస్తోంద న్నారు. మహిళలు అభివృద్ధి చెందిన తర్వాత ప్రభుత్వాలకే రుణాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతారన్నారు. మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు త్వరలో కలెక్టర్లతో వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహిస్తామన్నారు. అగస్టు 15న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరో జత యూనిఫామ్ ఇచ్చేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.






