కౌలు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
- కౌలురైతుల గుర్తింపు చట్టాన్ని అమలు చేయాలి
- ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పలువురు వక్తలు
- ‘తెలంగాణ కౌలు రైతుల సర్వే- 26’ నివేదిక విడుదల
ముషీరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ఎన్నికల వాగ్దానం ప్రకారం కౌలు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. భూమి లేకున్నా వ్యవసాయం చేస్తూ నలుగురికి అన్నం పెడుతున్న కౌలు రైతులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కౌలు రైతుల గుర్తింపు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 22 జిల్లాలలోని 47 మండలాలు, 58 గ్రామాల్లోని 1,816 మంది కౌలు రైతుల అనుభవాలు, సమస్యలు, జీవన వాస్తవాల ఆధారంగా సిద్ధమైన ’తెలంగాణ కౌలు రైతుల సర్వే-2026’ నివేదికను మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో విడుదల చేశారు. ఈ సర్వేలో తెలంగాణ వ్యాప్తంగా కౌలు రైతులతో ముఖాముఖి మాట్లాడి వా రి జీవన వాస్తవాలను క్షేత్రస్థాయిలో నమో దు చేసిననట్లు తెలిపారు.
కమిటీ ప్రతినిధి కన్నెగంటి రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ చంద్రకుమార్, ప్రొ.హర గోపాల్, ప్రొ.నరసింహ రెడ్డి, విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి హాజరై మాట్లాడారు. కౌలు రైతులకు వెంటనే గుర్తిం పు కల్పించాలన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి భారీగా నిధులు ఖర్చు చేస్తున్న ప్పటికీ, వాటి ప్రయోజనాలు ఎక్కువగా భూ యజమానులకే చేరుతున్నాయని అన్నారు.
అసలు సాగుదారులైన కౌలు రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం హామీలను ఇంకా జఠిలం చేయొద్దన్నారు. క్వింటాల్ కు రూ.500 బోనస్, ఎరువులు, రైతు భరోసా తదితర హామీలను నెరవేర్చాలన్నారు. కమిటీ ప్రతినిధులు విస్సా కిరణ్, కన్నెగంటి రవి, కొండల్ మాట్లాడుతూ సర్వే లో పాల్గొన్న కౌలు రైతుల్లో అధిక శాతం మంది తమకు గుర్తింపు, సబ్సిడీ ఎరువులు, విపత్తు పరిహారం, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) ప్రయోజనాలు నేరుగా అందించాలని కోరినట్లు తెలిపారు.
ప్రతి ఏడాది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణ అర్హత కార్డులు(ఎల్‌ఈసీ) జారీ చేయడం, ఈ-క్రాప్ బుకింగ్తో పాటు అన్ని పథకాలను వాటికి అనుసంధానం చేయడం, చట్టపరమైన మా ర్పులపై కౌలు రైతు సంఘాలతో సంప్రదింపులు జరపాలని కోరారు. ఈ ఏడాదిలోనే కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో దళిత బుహుజన ఫ్రంట్ నేత పి.శంకర్, ఒంటరి మహిళా సంఘం బాధ్యులు జనార్ధన్, తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల నేత వెంకట్, మహిళా రైతుల హక్కుల వేదిక జాతీయ నేత డాక్టర్ రుక్మిణి రావు, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ బాధ్యులు చుక్కమ్మ, బి.కొండల్, పలు జిల్లాలనుంచి వచ్చిన కౌలు రైతులు పాల్గొన్నారు.






