calender_icon.png 9 July, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్‌కు ప్రోత్సాహం

07-12-2024 01:08:17 AM

  1. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీశాఖ మంత్రి జితేంద్రసింగ్ 
  2. కాలుష్య రహిత ఉత్పత్తులకు తెలంగాణ ప్రోత్సాహం
  3. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్థానంలో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ప్రోత్సహిస్తున్నామని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.

గ్రీన్‌వర్క్స్ బయో అనే సంస్థ హబ్సిగూడ్‌లోని సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ సాంకేతిక సహకారంతో రూపొందించిన బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఒక్కసారి మాత్రమే ఉపయోగపడే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల తీవ్ర కాలుష్య సమస్య ఉత్పన్నమవుతోందని వెల్లడించారు.

సంప్రదాయ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి సుస్థిరాభివృద్ధి వైపు పయనించడానికి నూతన ఆవిష్కరణలు తోడ్పడుతాయని తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కాలుష్య రహిత ఉత్పత్తుల పరిశోధనలను తెలంగాణ ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాల మేరకు పర్యావరణానికి పెను ప్రమాదంగా పరిణమించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరముందని చెప్పారు.

అందులో భాగంగా బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రీన్‌వర్క్స్ బయో లాంటి సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ప్రశంసించారు. బయోప్లాస్టిక్స్ వినియోగం అన్ని రంగాల్లో అవసరమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, గ్రీన్ బయో వర్క్స్ డైరెక్టర్ రిషికారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

డైనమిక్ ఇన్నోవేషన్ కేంద్రంగా టీ-హబ్

టీ-హబ్‌ను డైనమిక్ ఇన్నోవేషన్ కేంద్రంగా మార్చాలని నిర్దేశించుకున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శుక్రవారం టీ-హబ్ వ్యవస్థాపక దినోత్సవ ముగింపు కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడుతూ.. టీ-హబ్‌ను సాధారణ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఇంటెలిజెన్స్ హబ్‌కు మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ఈ పరివర్తన స్టార్టప్‌లకు మాత్రమే కాకుండా వాటి వ్యాప్తి వృద్ధికి ఉత్ప్రేరకమవుతుందన్నారు. నూతన ఆవిష్కరణల్లో గ్లోబల్ లీడర్‌గా ఉండేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. టీ-హబ్ సీఈవో సుజిత్ జాగిర్దార్ మాట్లాడుతూ.. స్టార్టప్‌లకు సాధికారత, సహకారాన్ని పెంపొందించే లక్ష్యంగా టీpహబ్ పనిచేస్తోందన్నారు.

టీ-హబ్‌లో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఐటీ సలహాదారు సాయికృష్ణ, టీ-హబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ప్రధార డెయిరీతో 200 మందికి ఉపాధి

 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారని, ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇటీవలే నూతన విధానాన్ని తీసుకువచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. డెయిరీ ట్రెండ్ పేరుతో ప్రధార డెయిరీ సంస్థ పాల ఉత్పత్తుల లోగోను శుక్రవారం బేగంపేటలోని ఒక ప్రైవేటు హోటల్‌లో మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు.

ప్రధార డెయిరీ రూ.20 కోట్ల పెట్టుబడితో షాద్‌నగర్ సమీపంలోని పెంజర్లలో పాల ఉత్పత్తుల ప్లాంటును ఏర్పాటు చేసిందన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 200 మంది ఉపాధి పొందుతారని తెలిపారు. నాణ్యమైన పాల, బేకరీ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందన్నారు. డెయిరీ ట్రెండ్స్ నాణ్యమైన ఉత్పత్తులతో వినియోగదారుల అభిమానాన్ని పొందాలని సూచించారు.

తెలంగాణలో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల ఏర్పాటుకు అద్భుతమైన, అనుకూలమైన వాతావరణం సృష్టించామని, ఈ అవకాశాన్ని పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, నిర్మాత బండ్ల గణేశ్, సినీ హీరో విశ్వక్‌సేన్, ప్రధార డెయిరీ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.