8 August, 2026 | 1:18 AM

ప్రజలకు మెరుగైన వైద్యం, సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

08-08-2026 12:08 AM
  1. జోగిపేట నకిలీ డాక్టర్ వ్యవహారంపై ఉన్నతాధికారులపై ఆగ్రహం 
  2. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి  దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి, ఆగస్టు 7 (విజయక్రాంతి) : జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలతో పాటు విద్య, తాగునీరు, వ్యవసాయం, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమం తదితర రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి, వాటి ఫలాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర్ రాజనర్సింహ సూచించారు.

శుక్రవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్  ప్రతీక్ జైన్తో కలిసి మంత్రి  దామోదర్ రాజనర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్యం, విద్య, సాగునీరు, తాగునీరు, వ్యవసాయం, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు సంబంధించి జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి పురోగతి, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, తదితర అంశాలపై శాఖల వారీగా మంత్రి సమగ్రంగా సమీక్షించారు.

జిల్లాలో వైద్య, ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడానికి చేపడుతున్న చర్యలపై మంత్రి సమీక్షించారు. జోగిపేట ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సిన డ్యూటీ డాక్టర్ స్థానంలో మరో నకిలీ వ్యక్తి  డాక్టర్గా విధులు నిర్వహించిన ఘటనపై మంత్రి  దామోదర్ రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రుల్లో వైద్యుల హాజరు, విధుల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని డిసిహెచ్‌ఎస్, ఆసుపత్రి సూపరింటెండెంట్లను ఆదేశించారు.

కంకోల్, సింగితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల  ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని, బర్దిపూర్, సుల్తాన్పూర్, నేరడిగుంట పీహెచ్ సి భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సంగారెడ్డి నర్సింగ్ కళాశాల, పటాన్చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, జహీరాబాద్ ఎం సి హెచ్ లనుత్వరలో ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు.

కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై మంత్రి సమీక్షస్తూ ఈనెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో  అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతి, సంబంధిత శాఖల అధికారులు,రెవెన్యూ డివిజనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.