ఆస్తి తగాదాలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలి
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర
హన్వాడ మే 5: భవిష్యత్తులో ఇబ్బందులకు తలెత్తకుండా ఆస్తి తగాదాలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర సూచించారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు హన్వాడ మండల పరిధిలోని ఏనెమీదితాండ గ్రామపంచాయతీ ఆవరణలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కుటుంబంలో పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిలో హక్కు ఉందని, ఆస్తి పంపకాలను చట్టబద్ధంగా పరిష్కరించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదన్నారు.
కుటుంబ సమస్యలను, గెట్టు పంచాయతీలను, చిన్న చిన్న గొడవలను పెద్దగా చేసుకొని కేసుల వరకు వెళ్లకుండా రాజీమార్గంలో పరిష్కారం చేసుకోవాలన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఇరువురిని పిలిపించి సమస్యను పరిష్కరించే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో తహసిల్దార్ కిష్ట్యా నాయక్, గ్రామ సర్పంచ్ భీమిబాయి, పంచాయతీ కార్యదర్శి రాజేష్, ఉపసర్పంచ్ నరేష్, గ్రామ పెద్దలు లింగం నాయక్, అంతిరామ్, రాజు నాయక్, యాదయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.






