calender_icon.png 25 August, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టైర్ల ఫ్యాక్టరీ కాలుష్యం నుంచి కాపాడండి

25-08-2025 02:01:08 AM

ప్రభుత్వానికి కాటపల్లి గ్రామస్తుల విజ్ఞప్తి

ఖైరతాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి) : గ్రామపంచాయతీకి, గ్రామ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని టైర్ల ఫ్యాక్టరీని మూసివేసి గ్రామ ప్రజల ప్రాణాలతో పాటు వ్యవసాయ భూములను కాపాడాలని యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లి గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కాటేపల్లి, పొరుగు గ్రామాలను రాష్ట్రంల కాలుస్తున్న టైర్ల ఫ్యాక్టరీ కాలుష్యంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి మ్యాజినాయమూర్తి చంద్రకుమార్, ప్రొఫెసర్ బాబురావు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, ఉద్యమకారుడు పృథ్వీరాజ్, మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు, కాటేపల్లి గ్రామస్తులు తదితరులు హాజరై మాట్లాడారు.. యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో వ్యవసాయ భూమికి అతి దగ్గరలో రెండు టైర్ల రీసైక్లింగ్ కంపెనీలను ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల నుంచి పాత టైర్లను తీసుకువచ్చి వాటిని ఉడికించి ఆయిల్, కార్బన్ పౌడర్, ఇనుము లను వేరుచేసి వాటిని అమ్ముకొని వ్యాపారస్తులు లాభం పొందుతున్నారని అన్నారు.

ఇట్టి కంపెనీని ఎన్విరాన్మెంట్ రూల్ ప్రకారం ఇండస్ట్రీ ఏరియాలో పెట్టకుండా వ్యవసాయ భూమి మధ్యలో పెట్టడం ద్వారా వాటి నుంచి వచ్చే దట్టమైన పొగ వల్ల చుట్టుపక్కల గాలి కలుషితమై వ్యవసాయ పనులు చేసుకునే రైతులు, కూలీలు, పిల్లలు, పశువులు తీవ్ర అస్వస్థకు గురవుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఫ్యాక్టరీ నుంచి వెలువడే నల్లటి బూడిద వల్ల రైతులు పండించే కూరగాయలు, పండ్లు కరాబై మార్కెట్లో సరైన ధర దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం కలగజేసుకొని ధనార్జన ధ్యేయంగా ఏర్పాటుచేసిన ఈ టైర్ల కంపెనీలను మూసి వేసి వేరే ప్రాంతాలకు తరలించి తమ ప్రాణాలను తమ వ్యవసాయ భూములను కాపాడాలని కోరారు.