భూ బాధితుల ఆందోళన
బాధితులకు పూర్తి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
షాద్ నగర్, జూలై 8(విజయక్రాంతి): అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని పేదల భూములను అడ్డగోలుగా ఆక్రమించుకున్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ షాద్ నగర్ పట్టణ కూడలిపై బుధవారం భూబాధితులు భారీ ధర్నా నిర్వహించారు. నిరుపేద జనాలను రోడ్డుపాలు చేసిన నవీన్ రెడ్డి.. ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని బాధితులు తీవ్రంగా విమర్శించారు.
ధర్నా సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిష్కళంక నాయకుడని, ఆయనను విమర్శించే నైతిక హక్కు నవీన్ రెడ్డికి లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేను రాళ్లతో కొట్టి చంపాలంటూ నవీన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.మామిడిపల్లి ప్రాంతంలో అడ్డగోలుగా భూకబ్జాలు చేసి ఎంతోమంది రైతుల మరణానికి నవీన్ రెడ్డి కారకుడయ్యాడని, ఆయనపై ఇప్పటికే 28 భూకబ్జా కేసులు నమోదయ్యాయని బాధితులు గుర్తు చేశారు.
గత 16-18 ఏళ్లుగా రెవెన్యూ అధికారుల అండతో తమ భూములను కాజేశారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమానికి నందిగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుమార్ గౌడ్ హాజరై బాధితులకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో భారీ ఎత్తున బాధితులు పాల్గొన్నారు.






