01-08-2025 12:42:19 AM
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి, జూలై 31(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరే ప్రతి పేషెంటుకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం కంది మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, జిల్లా ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా? అందరూ విధులకు హాజరయ్యారా? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు .
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను, సిబ్బంది హాజరు వివరాలను, క్షేత్రస్థాయిలో ఆరోగ్య సర్వే, నివేదికల రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోజూ వచ్చే ఓపి పేషెంట్ల సంఖ్య, ఇన్పేషెంట్, ఔట్పేషెంట్ వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ప్రజలకు మంచి వైద్యం అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం నిబద్దతతో పనిచేయాలని ఆమె తెలిపారు.
అలాగే విద్యార్థుల మేధస్సును వెలికితీయడానికి డిజిటల్ తరగతులు నిర్వహించాలన్నారు. అనంతరం విద్యార్థులకు డిజిటల్ పాఠాలను కలెక్టర్ బోధించారు. అలాగే తరగతిలో విద్యార్థులతో కలిసి కూర్చుని ఉపాధ్యాయురాలు బోధించే విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.