06-01-2026 12:34:34 AM
శాసన మండలిలో చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
చేవెళ్ల, జనవరి 5, (విజయక్రాంతి): ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతి కోసం రైతుల నుండి తీసుకున్న భూములకు ప్రతిగా ఇవ్వాల్సినవి వెంటనే ఇచ్చి న్యాయం చేయాలని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ శాసన సభల 25వ సమావేశం నాలుగో రోజు శాసనమండలి లో డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ నేతృత్వంలో సాగిన ప్రత్యేక ప్రస్తావన లలో ఆయన చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలో పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి పై వివరించారు.
నియోజకవర్గంలోని షాబాద్ మండలంలో ఇలా టీజీఐఐసీకి పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం సుమారుగా 3000 ఎకరాల రైతుల భూమిని సుమారు 2000మంది రైతుల వద్ద సేకరించి అప్పగించడం జరిగిందన్నారు. తానూ మంత్రిగా పరిశ్రమల కోసం రైతులను ఒప్పించామని వివరించారు.
ఈ నేపథ్యంలో చందన వెళ్లి లో 1200 ఎకరాలు 650 మందివి, సీతారాంపురం లో 1150 ఎకరాలు 600 మంది రైతులవి, హైతాబాద్, మాచనపల్లి గ్రామాలకు చెందిన 500 ఎకరాలు 300 మంది రైతులవి అలాగే పెద్దవీడు గ్రామానికి చెందిన 150 ఎకరాలు 70 మంది రైతుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేల్స్పన్, అమేజాన్ లాంటి బడా కంపెనీలకు ఇచ్చి పరిశ్రమలను స్థాపించారని చెప్పారు.
అయితే భూములు కోల్పోయే సమయంలో రైతులకు ఎకరా భూమికి ఒక గుంట భూమిని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇస్తామని హామీ ఇచ్చిందని వివరించారు. కిరా అవసరం తీరిపోయిన తర్వాత వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారు ఇచ్చిన ఫిర్యాదులను అధికారులు చట్టబుట్టలో వేస్తున్నారని అన్నారు. నాటి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా వెంటనే స్పందించి భూములు కోల్పోయిన రైతులకు ఎకరం భూమికి గుంట చొప్పున భూమిని ఇవ్వాలని, అలాగే ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన వివరించారు.
అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కూడా మహేందర్ రెడ్డి కి మద్దతుగా నిలిచారు. హైదరాబాద్ నగర పరిసరాల చుట్టూ ఇలా చాలామంది రైతులు భూమిని కోల్పోయారని వారికి న్యాయం చేయాలని డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ సైతం మంత్రికి సూచించారు. మంత్రి హజారుద్దీన్ స్పందిస్తూ ప్రభుత్వానికి నివేదిస్తామని అందరికీ అన్ని సౌకర్యాలు అందే విధంగా చూస్తామని హామీ ఇస్తామని చెప్పారు.