06-01-2026 12:34:20 AM
భద్రాద్రి కొత్తగూడెం జనవరి 5, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ల జాబితాలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఓ డివిజన్ పరిధిలో ఇండ్లు లేకున్నా ఓట్లు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేదర్ బస్తి 51వ డివిజన్ ఏర్పాటయింది. సంవత్సరాలుగా రైల్వే శాఖకు చెందిన స్థలంలో సుమారు 70 నుంచి 100 కుటుంబాలు ఇండ్లు నిర్మించుకునే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రైల్వే అధికారులు నాలుగు సంవత్సరాల క్రితం నివాసం ఉన్న వారిని ఖాళీ చేయించి ఇండ్లను కూల్చివేశారు.
జనాభా లేరు ఓట్లు పదిలం..
నాలుగు సంవత్సరాల క్రితం ఖాళీ అయిన 51 డివిజన్ పరిధిలో 7-1 బ్లాక్ మేదర్ బస్తి, తుమ్మల నగర్ ప్రాంతంలో ని ఓటరు జాబితాలో సుమారు 250 మంది ఓటర్లు నమోదయి ఉన్నారు. గతంలో ఇక్కడ నివాసం ఉన్న వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు, అయినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓటర్ల జాబితాలో వాళ్ల పేర్లు పదిలంగా ఉన్నాయి. మున్సిపల్ అధికారుల పనితీరుకు చక్కని తార్కాణం. సంబంధిత మున్సిపల్ సిబ్బంది ఈ విషయంపై ప్రశ్నిస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని సమాధానమివ్వటం గమనార్హం.