హామీలు అమలు చేయకుంటే ఉద్యమ బాట పడతాం
- పీఆర్సీ, సీపీఎస్ ఇతర సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి పీఆర్టీయూ హెచ్చరిక
గజ్వేల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పీఆర్టీయూ సిద్ధిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదరాసుపల్లి శశిధర్ హెచ్చరించారు. రాయపోలు మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పీఆర్సీ అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయలేదన్నారు. అలాగే మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా సీపీఎస్‌ను పూర్తిగా రద్దు చేసి, 50 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల నుంచి హెల్త్ ప్రీమియం కోత విధించి రెండు నెలలు గడిచినా ఆరోగ్య కార్డుల మార్గదర్శకాలు విడుదల చేయలేదని విమర్శించారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని, పెండింగ్ బిల్లులను నెల రోజుల్లోపు చెల్లించాలని, బకాయిలో ఉన్న ఆరు డీఏలను వెంటనే మంజూరు చేయాలని కోరారు. లేనిపక్షంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాయపోలు మండల శాఖ అధ్యక్షుడు దుంబాల ఇంద్రసేనారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి లచ్చు గారి కనకారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్, సీనియర్ నాయకులు గుర్రం నాగరాజు, ఎం. నాగరాజు, బొల్లం సంపత్, భాను, నవీన్ తదితరులు పాల్గొన్నారు.






