calender_icon.png 3 November, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

03-11-2025 04:01:30 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు లతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తాండూర్ మండలం గోపాల్ వాడకు చెందిన రౌతు మంగమ్మ, మంచిర్యాల పట్టణం హమాలీవాడకు చెందిన సూరం మల్లయ్య తమకు వృద్ధాప్య పింఛను ఇప్పించాలని కోరుతూ వేరువేరుగా దరఖాస్తులు అందజేశారు.

దండేపల్లి మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన కొల్లూరి సుగుణ తన ఇంటి స్థలంలో వేరొక వ్యక్తి చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను నిలుపుదల చేసి అక్రమ నిర్మాణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరుతూ... అర్జీ సమర్పించారు. మంచిర్యాల పట్టణం శ్రీశ్రీ నగర్ కు చెందిన జాడి రాజమల్లు తాను మంచిర్యాల మండల తహసిల్దార్ కార్యాలయంలో ఆర్టీఐ చట్టం ప్రకారం సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. నస్పూర్ మండలం లోని శ్రీరాంనగర్ కు చెందిన ఎర్రం నర్సయ్య, సందవేని మల్లయ్య తమకు జీరో బిల్లు పథకం వర్తింపచేయాలని కోరుతూ వేరువేరుగా దరఖాస్తులు అందజేశారు.

హాజీపూర్ మండలం పడ్తనపల్లి గ్రామానికి చెందిన కాంపెల్లి విజయ్ సాగర్ తమ నివాస ప్రాంతాలలో పందుల వలన ఇబ్బందులు పడుతున్నామని, సమస్య పరిష్కరించి తమను ఆదుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జైపూర్ మండలం ముదిగుంట గ్రామానికి చెందిన గోదారి లక్ష్మణ్ మండలంలోని నర్వ గ్రామ శివారులోని తమ భూములు రెవెన్యూ రికార్డులలో ఇతరుల పేరిట చూపుతుందని, సమగ్ర విచారణ జరిపి తమ పేరిట మార్పు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.