19-05-2025 01:50:52 PM
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషిచేసిన త్యాగదనుడని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. సోమవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 40 వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం,భుక్తి కోసం,పేద ప్రజల విముక్తి కోసం తెలంగాణ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ సాయుధ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య అగ్ర భాగాన ఉండి సాయుధ పోరాటాన్ని నడిపారని అన్నారు. 1934 వ సంవత్సరంలో తన సొంత గ్రామం నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా అలగానిపాడు లో వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించి,వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపిన మహా యోధుడు సుందరయ్య అని అన్నారు.
చట్టసభలకు వన్నె తెచ్చిన మహానేత సుందరయ్య అని, ఆయన పార్లమెంటు, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ,ఆదర్శ నేతగా ఉంటూ, ప్రతిపక్ష, అధికార పక్ష నేతల మన్ననలు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సిహెచ్ లక్ష్మీనారాయణ, ఎం డి సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, నలపరాజు సైదులు, ఆకారపు నరేష్, పోలే సత్యనారాయణ, బి.పరిపూర్ణ చారి, భూతం అరుణకుమారి, రవీ, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.