calender_icon.png 26 August, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవ్ పార్టీ భగ్నం చేసిన ఈగల్ టీమ్

25-08-2025 10:56:50 PM

43 గ్రాముల మాదకద్రవ్యాలు స్వాధీనం

డిప్యూటీ ఎమ్మారో మణిదీప్ పరారీ

సర్వీస్ అపార్ట్మెంట్స్ లో ఈవెంట్స్ కోసం పోలీస్ పర్మిషన్ తప్పనిసరి

మాదాపూర్ డీసీపీ వినీత్

గచ్చిబౌలి,(విజయక్రాంతి): రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. కొండాపూర్‌లోని రాజేశ్వరి నిలయం సర్వీస్ అపార్ట్మెంట్‌లో ఈగిల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడిలో 20 గ్రాముల కొకైన్, 20 గ్రాముల ఎనిమిది టాబ్లెట్స్, 3 గ్రాముల ఎమ్‌డిఎమ్‌ఏను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబందించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో డ్రగ్ పెడ్లర్లు తేజ, విక్రమ్, వినియోగదారులు నీలిమ, పురుషోత్తం రెడ్డి, భార్గవ్, అలాగే డ్రగ్స్ చేరవేసే చందన్ ఉన్నారు.

ఈ కేసులో బెంగళూరుకు చెందిన రాహుల్, ఏపీ కి చెందిన డిప్యూటీ తహసిల్దార్ మణిదీప్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. తేజ, విక్రమ్ లు రాహుల్ వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నీలిమతో కలిసి గోవా, రాజమండ్రిలో రేవ్ పార్టీలు నిర్వహించేవారని దర్యాప్తులో తెలిసింది. న్యూ ఇయర్ సందర్భంగా గోవాలో తేజ నిర్వహించిన రేవ్ పార్టీలో నీలిమ కూడా పాల్గొంది. విక్రమ్ మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసు నిందితుడు సూర్యకు స్నేహితుడు కాగా, చందన్ అనే ట్రాన్స్పోర్టర్ ద్వారా హైదరాబాద్‌కు డ్రగ్స్ తెప్పించేవారని పోలీసులు వివరించారు. డ్రగ్స్ కు బానిసైన డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్ రాజమండ్రిలో సొంత ఫామ్ హౌస్‌లోనూ రేవ్ పార్టీలు ఏర్పాటు చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

నీలిమ, తేజకు డ్రగ్స్ అలవాటు చేయించింది కూడా మణిదీప్ అనే విషయం విచారణలో బయటపడింది. విక్రమ్, నీలిమ ఐటీ ఉద్యోగులు కాగా, తేజకు క్లౌడ్ కిచెన్ వ్యాపారం ఉంది. తేజ వ్యాపారం నష్టాల్లో పడడంతో రేవ్ పార్టీలు నిర్వహించడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. రాహుల్‌కు నైజీరియన్ మైక్ డ్రగ్స్ సరఫరా చేసేవాడు. తేజకు చర్మ కాంతి కోసం గ్లూటాహియోన్ ఇంజెక్షన్లు వాడే అలవాటు ఉంది. దీన్ని బెంగళూరు నుండి రాహుల్ పంపించే సమయంలో డ్రగ్స్ కూడా అందులో పెట్టి రహస్యంగా తేజకు సరఫరా చేసేవారని పోలీసులు తెలిపారు.

సర్వీస్ అపార్ట్మెంట్స్, హోటల్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసే వారు స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ఖచ్చితంగా అనుమతులు పొందాలని, లేనియెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. అదేవిధంగా కొంత మంది యువత డ్రగ్స్ కు బానిసలై నేరాలకు పాల్పడుతున్నారని, తల్లిదండ్రులు యువత పట్ల జాగ్రత్తగా ఉండాలని, చెడు అలవాట్లకు బానిస అవకుండా చూడాలని, ఎవరైనా డ్రగ్స్ కు బానిస అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు డ్రగ్ ఫ్రీ తెలంగాణలో ప్రజలందరూ భాగస్వాములవ్వాలని ఈ సందర్భంగా డీసీపీ వినీత్ కోరారు.