calender_icon.png 13 May, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్క పిల్ల

19-08-2024 12:00:00 AM

  • 24న దాశరథి రంగాచార్య జయంతి

* దాశరథి రంగాచార్య తమ అగ్రజులు (అన్న) కృష్ణమాచార్యుల వారికి తగ్గ తమ్ముడు. ఇరువురు అన్నాతమ్ములది నిజానికి తెలుగు సాహిత్యంలో చెరో పాయ. రంగాచార్య వారి వచన శైలి అత్యద్భుతం. ఆగస్టు 24 వారి జయంతి సందర్భంగా ‘జయశ్రీ’ సంక్రాంతి ప్రత్యేక సంచిక (1976)లో ప్రచురితమైన కథను ‘అక్షర’ పాఠకుల కోసం పునర్ముద్రిస్తున్నందుకు ఆనందంగా ఉంది. జీవ కారుణ్యాన్ని ఎంతో భావోద్వేగంతో వ్యక్తపరిచిన గొప్ప కథ ఇది. ప్రియ పాఠకులారా, చదవండి.

 ఎడిటర్, ‘విజయక్రాంతి’

పూలంటే నాకు ఇష్టం. పారిజాతాలంటే మరీ ఇష్టం. చాలా మక్కువ, పారిజాతం -మొక్క చాలాసార్లు నాటాం. అంటుకో లేదు. అంటుకుంటే పెరక్కుండానే ఎండిపోయేది. చివరకు కాంపౌండు పక్కన నాటాం. అది అంటుకుంది. గుబురుగా పెరిగింది. పూలు విరగ బూస్తుంది. ఎర్రని కాడ, పల్చని రెక్కలు, లేత సువాసన. పారిజాతం అందంగా ఉంటుంది. అవి నేల రాలినప్పుడు చూట్టం, వాటిని ఏరడం నాకు సరదా. మీ పారిజాతం చెట్టు మా కాంపౌండు బయటికి గూడా వ్యాపించింది.

పూలు రోడ్డుమీద కూడా రాల్తాయి. వాటిని అంతా ఏరుకుపోతారు. అవీ మా చెట్టు పూలేగా అని నాకు గర్వం. శ్రీమతికి అది నచ్చదు. మన చెట్టుపూలు వేరే వాళ్ళెందుకు తీసుకోవాలి అంటుంది. అందుకు కొన్నాళ్ళు కాపలా కూడా ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళతో తగాదా కూడా వచ్చింది. అయినా ఆ పూలమీద మమకారం వదులుకోలేదామె. చివరకు ‘ఒక ఉపాయం కనిపెట్టింది. మా పాపను తెల్లారుజామున లేపుతుంది. పూలబుట్ట అందిస్తుంది. ఎవరూ లేవక ముందే మా పాప పూలు ఏరి తెస్తుంది. పాపకు కూడా సరదాయే పారిజాతాలంటే.

ఒకనాటి తెల్లారు జామున పాప నన్ను లేపింది. “నాన్నా కుక్క పిల్లలు పెట్టింది. ఎంత బావున్నాయనుకున్నావు! పారిజాతం చెట్టు కింద నాలుగు పిల్లలు పెట్టింది” అని నాలుగు వేళ్ళు చూపింది. నన్ను లాక్కెళ్ళింది. మా కాంపౌండు అవతల కుక్క పిల్లలు పెట్టింది. పిల్లలు ముద్దుగా ఉన్నాయి. రెండు నల్లగా ఉన్నాయి. ఒకటి నల్లగా ఉండి తెల్లని మచ్చలది. మరొకటి తలమీద పొట్టమీద నల్లగా ఉంది, మిగతాది తెల్లగా ఉంది.

నాలుగు పిల్లలూ బావున్నాయి. అవి పారిజాతాల్లో ఉన్నాయి. వాటిమీద పారిజాతాలున్నాయి. తల్లి కుక్క నన్ను చూచింది. చెవులు నిక్క పొడిచింది. లేచి నుంచుంది. గుర్రుమంది. దాని కళ్ళు మెరుస్తున్నాయ్. గుర్తుగుర్రు మంటూంది. అడుగు ముందుకు వేస్తే కొరికేస్తానంటూంది. పాప నా చాటుకు చేరింది. నేను అడుగు ముందుకు వేయలేదు. పాప పారిజాతాలు ఏరలేదు. మేం లోపలికి వచ్చాం.

శ్రీమతి గడప కడిగింది. పసుపు రాచింది. కుంకం బొట్లు పెడ్తుంది. అలాంటప్పుడు గడప దాటరాదు. దాటితే శ్రీమతి పులి అవుతుంది. అందుకు బయటనే నుంచున్నా.

“ఏవండి! కుక్క పిల్లలు బావున్నాయి. సాదుకుందామా?” అర్థిస్తున్నట్లుగా అడిగింది. 

బొట్లు పెట్టడం ఆపి ముంజేతితో ముఖం మీది వెంట్రుకల్ను తొలగిస్తూ తల ఎత్తి నావైపు చూస్తూ.

ఆవిడకు తెలుసు నా బలహీనత. అలా చూస్తే దేనికైనా వప్పుకుంటానని.

“అవున్నాన్నా! కుక్కపిల్లల్ను సాకుదాం” పాపకూడా ఆడిగింది. రెండు చేతులో పూలబుట్ట పట్టుకొని తలెత్తి చూస్తూ.

నాకు కుక్కలంటే బొత్తిగా ఇష్టం లేదు. కాదు గిట్టదు, వాటికి మనుషుల్ను మించిన విశ్వాసం ఎందుకుండాలి? కారణం అదని చెప్పలేను. కాని, కుక్కలంటే గిట్టదు. అవి కరుస్తాయి, కరిచే కుక్కలంటేనే కాదు అసలు కుక్కలంటేనే గిట్టదు నాకు. కారణాలెందుకు కుక్కలంటే నాకు గిట్టదు అంతే.

శ్రీమతి చూపులకు ఓడిపోయాను. అవన్నీ చెప్పలేక పోయాను. “చూతాంలే” అని తప్పుకున్నాను. శ్రీమతి చిన్నబుచ్చుకుంది. అది నాకు కాస్త బాధ కలిగించింది. అనాడు గేటు దాకా వచ్చి సాగనంపలేదు శ్రీమతి. ఏదో వెలితిగానే ఆఫీసుకు వెళ్ళాను. అక్కడ నా మనసులో కుక్కపిల్లలే మసలుతున్నాయి. చిన్నబుచ్చుకున్న శ్రీమతే కనిపిస్తుంది.

సాయంకాలం ఇంటికి వచ్చేవరకు శ్రీమతీ, పాపా గేట్లో నుంచుని ఉన్నారు. 

“చూశారా, పాపం కుక్కపిల్ల చచ్చిపోయింది.” 

తల్లి కుక్క కూర్చొని కన్నీరు కారుస్తుంది. ఏమిటో మమకారం నా గుండె కరిగింది. చూళ్ళేక పోయాను. ఇంట్లోకి వచ్చేశాను.

రాత్రి భోజనాలు చేస్తున్నాం. “నాన్నా కుక్కపిల్లను సాదుకుందామా” పాప అంది. శ్రీమతి అనలేదు. అలా నావైపు చూస్తూ కూర్చుంది. వంకాయకూర చాల బావుందన్నాను. శ్రీమతి మురిసిపోవాల్సింది. ఉహుఁ అలా కాదే! గబగబా భోజనం ముగించింది. లేచిపోయింది. గ్రహించాను, తాను అడగలేక పాపతో అడిగించింది. అబ్బో ఆ రాత్రి చాలా టెక్కు చేసింది. కంచి పట్టుచీర -కొని పెడ్తానన్నాను. తనకు పాలపిట్ట రంగుది కావాలంది.

పాప పారిజాతాలు ఏరడం మానేసింది. కుక్క ఉందిగా చెట్టుకింద. శ్రీమతికి సంతోషంగా ఉంది. ఎంచాతంటే మరెవరూ పూలు ఏరుక పోవడం లేదు. నేను ఆఫీసుకు వెళ్ళేప్పుడు చూస్తాను. నలిగిన పారిజాతాల్లో పడి ఉంటుంది తల్లికుక్క. మూడు పిల్లలూ పాలు తాగుతుంటాయి. పిల్లలు చాల సతాయిస్తాయి. లాగుతాయి. కొరుకుతాయి. పీకుతాయి, ఎంత సహనం తల్లికి! కిక్కురు మనదు. అలాగే పడి ఉంటుంది. పాలన్నీ అయిపోయే దాకా! తల్లిని మించిన సహనం ఎవరికుంది?

ఒకనాడు ఇంటికి వస్తుంటే కుక్కపిల్లలూ కనిపించాయి రోడ్డుమీద. అవి ఆటలాడుకుం టున్నాయి. దూరంగా పరుగులు తీస్తున్నాయి. దగ్గరికి వస్తున్నాయి. కొట్లాడుకుంటున్నాయి, పోట్లాడుకుంటున్నాయి. మళ్ళీ కరుస్తున్నాయి. కలుస్తున్నాయి. కుక్కపిల్లలు చూడ్డానికి బాగనిపించాయి. పిల్లలు అన్నీ బావుంటాయి. పెరిగినప్పుడు చూడాలి. తల్లికుక్క ఎలా ఉంది, ఎముకల పోగులా! అది జాతికుక్క కాదు, నాటుకుక్క.

సాయంకాలం ఇంటికి వచ్చాను. కాఫీ అందిస్తూ శ్రీమతి చెప్పింది “రెండు కుక్క పిల్లలు చచ్చిపోయాయని”. అవి కారు కింద పడ్డాయట. పాప మరీ వర్ణించి చెప్పింది. అవి కారు చక్రాలకింద పడడం.. నలిగి చావడం నా మనసు కలుక్కుమంది. కాఫీ తాగలేదు. గబగబా గేటు దగ్గరికి వచ్చి చూచాను. ఒకే కుక్కపిల్ల వంగి కూర్చొని ఉంది. తల్లికుక్క దాని పక్కనే కూర్చుంది. కన్నీరు కార్చడం లేదు-, బహుశా ఎండిపోయి ఉంటుంది. దీనంగా దుఃఖంగా నావేపు చూస్తుంది. నేను చాలాసేపు చూళ్ళేక పోయాను. ఇంట్లోకి వెళ్ళి సిగరెట్టు కాల్చాను. శ్రీమతి అదోలా చూచింది నన్ను, ఆవిడ చూపులు నాకు తెలుసు. ఆవిడ పెదవి ఎక్కువగా కదల్దు. చూపులే మాట్లాడ్తాయి! ఇప్పుడామె అంటున్నదేమంటే కుక్క పిల్లలు చచ్చాయని. ఆవిడ చూపులు చూడ్డం మానేశాను. పాప చూస్తూంది. పాప అచ్చం తల్లి పోలికే. ‘నాన్న.. కుక్కపిల్లను సాదుకుందాం’ అంటూంది చూపుల్తో. నేను కాఫీ వదిలేశాను. కాని, మరో సిగరెట్టు కాల్చాను. 

ఒకనాడు సినిమాకు వెళ్ళాం. సినిమా అయిపోయింది. ఏం బావుండలేదు. చెత్త. అయినా సినిమాలు చూడాల్సిందే. చూడ్డంతోనే విసిగి పోయామా, టాక్సీలో బయల్దేరాం. టాక్సీ డ్రైవరు కుర్రాడు. అతడూ సినిమా చూచాడు. హుషారుగా ఉన్నాడు. జోరుగా నడిపిస్తున్నాడు కారు. ర్యాష్ డ్రైవింగ్. రెండు మూడు చోట్ల మనుషులకు పెట్టేవాడే. కాని తప్పిపోయింది. శ్రీమతి దిగులు దిగులుగా చూస్తుంది. నాకూ భయంగానే ఉంది. పాప నన్ను కరచి పెట్టుకొని కూర్చుంది.

కారు ఖర్రుమని ఆగింది. పెద్ద కుదుపు ఇచ్చింది. నాకేదో భయం అయింది. మనిషి చచ్చాడనుకున్నా. “ఏమైంది?” అడిగాను. “ఏం లేదు సార్ కుక్క” అని స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు. “డ్రైవర్ ఆపు” అని గట్టిగా కేక పెట్టాను. డ్రైవర్ అదురుకొని ఆపేశాడు.

డోరు తెరచి దిగాం. చూస్తే తల్లికుక్క కడుపు మీదినుంచి కారుపోయింది. చితికింది. పేగులు బయటపడ్డాయి. కుక్కపిల్ల ఉరికి వచ్చింది. తల్లిచుట్టూ తిరుగుతూంది. తల్లికి ఇంకా కొన ఊపిరి ఉంది. అది నావైపు దీనంగా చూస్తున్నది. జాలిగా చూస్తున్నది. కుక్కపిల్ల చూస్తున్నది. నావైపే చూస్తున్నది. నేను ఏడ్చాను. డ్రైవర్ని తిట్టేశాను. అతడు తలవంచుకున్నాడు. వెళ్ళిపోయాడు.

తల్లికుక్క చచ్చిపోయింది రోడ్డుమీద డొక్క చితికి.

కుక్కపిల్ల నా కళ్ళల్లో మసల- సాగింది. ఏదో నాకు బాధ్యత ఉన్నట్లు ప్రవర్తించసాగింది.

తల్లికుక్క చూపులు గుర్తుకు వచ్చాయి. అది అలా ఎందుకు చూచింది? ‘ఈ పిల్లను నీకు అప్పగిస్తున్నా’ అన్నది. ‘ఇహ నీదే బాధ్యత’ అన్నది. అవును అది నాకో బాధ్యత అప్పగించి పోయింది.

కుక్కపిల్లను చూచాను. ముద్దుగా ఉంది. తలమీద, పొట్టమీద నల్లని మచ్చ, మిగతా తెలుపు. దాని కళ్ళు మెరుస్తున్నాయి. ఎందుకో, అదంటే ముద్దు వచ్చింది నాకు. దాన్ని అందుకున్నాను. ఎత్తుకున్నాను, తల నిమిరాను.

శ్రీమతి కళ్ళు మెరిశాయి.

పాప తనకిమ్మని కుక్కపిల్లను ఎత్తుకుంది.

కుక్కపిల్ల సహితంగా నలుగురం ఇంటివైపు సాగాం.

(‘కథా నిలయం’ సౌజన్యంతో..)