calender_icon.png 14 May, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాసనాల్లోనే కావ్యరచనకు శ్రీకారం వెల్లంకి గంగాధరుడు

19-08-2024 12:00:00 AM

“శ్రీకాంతాకాంతుచే నాశ్రిత విబుధ జనాభి స్థిరప్రాజ్య

శ్రీకాంతాకాంతుచే విస్తృత నిజభుజ నిస్త్రింశ నీతాన్యరాజ

శ్రీకాంతాకాంతుచే దిక్‌క్షిత గగన సమాశ్లిష్ట విస్పష్ట కీర్తిన్

శ్రీకాంతాకాంతుచే నూర్జితరిపు మృగరాజీ మృగారాతి చేన్’

ఇది చాలా విశేషమైన పద్యం. సాధారణంగా కవులు ఒక ప్రాసాక్షరాన్ని ప్రయోగించి పద్యం నిర్మిస్తుంటారు. అలంకారాల్లో వృత్త్యనుప్రాసం కోసం మొత్తం పద్యంలో పలుచోట్ల ప్రాసాక్షరం నిలుపుతుంటారు. కానీ, ఐదు ప్రాసాక్షరాలను ప్రయోగించడం ద్వారా ఇదొక ‘పంచాక్షర ప్రాస’ కలిగిన పద్యంగా కవి రచించాడు. ద్విప్రాస, త్రిప్రాస వంటి లక్షణాలతో లాక్షణికులు తమతమ ఛందోగ్రంథాల్లో చెప్పడమేగాక దానికి అవసరమైన లక్ష్యాలను కూడా తామే రాస్తుంటారు. కానీ, ఇక్కడ ఐదు ప్రాసాక్షరాలను ప్రయోగించి రచించిన కవి వెల్లంకి గంగధరామాత్యుడు. ఆయనొక మంత్రి, ఓ ప్రాంతపు పాలకుడు. పైగా తాను వేయించిన శాసనాల్లో పద్యాలను తానే రాసిన కవికూడా కావడం విశేషం.

మంత్రి, వీరసైనికుడే శాసనకవిగా..

వెల్లంకి గంగాధరుడు ప్రత్యేకంగా ఒక కవికాదు, ఏ కావ్యమూ రచించలేదు. మరి, ‘ఆయనను గురించి మనం తెలుసుకోవలసిన విశేషాలేముంటాయి?’ అన్న ప్రశ్న ఎదురవుతుంది. గంగాధరు డు, కాకతీయ రాజైన మొదటి రుద్రుని మంత్రి. రుద్రుడు పాల్గొన్న అనేక యుద్ధాలలో తానూ భాగస్వామియైనాడు. యుద్ధంలో వీర విహారం చేసి రుద్రుని విజయాలలో తన వంతు పాత్రను సమర్థంగా నిర్వహించిన వీర సైనికుడు. ఇవన్నీ ఒక పార్శం. కానీ, ఆయనలో ఒక కవికూడా ఉన్నాడు.

అయితే, అతనికి కావ్యం రాసే అవకాశం లేకనో, వీలు చిక్కకనో పాలకుడుగా వేయించిన శాసనాల్లో కావ్య నిర్మాణం చేసే ప్రయత్నం జరిపాడు. రాజులు తమ ఆస్థానకవులతోనో, ఇతర కవులతోనో తమ కీర్తిని, తమ విజయాలను శాసనబద్ధం చేయిస్తుండడం సాధారణం. కానీ, ఈ గంగాధరుడు స్వయంగా కవి గనుక ఆయనే తాను రచించిన శ్లోకాలతో పద్యాలతో శాసనాలు వేయించాడు. ఈ క్రమంలో ‘నగునూరు’లో వేయించిన శాసనంలో ఒక కావ్యం రాయాలన్న ప్రయ త్నం కనిపిస్తుంది. ఓరుగల్లుకు అతిసమీపంలోని ‘ఉర్సు’గుట్టపై వున్న ఒక శాసనంలో ‘సిద్ధోద్వాహము’ అనే ఒక సంస్కృత కావ్యమే చెక్కబడింది. ‘నృసింహర్షి’ అనే  కవి దీని రచయిత. ఈ మార్గానికి ఆద్యుడు వెల్లంకి గంగాధరుడు.

‘సిద్ధోద్వాహము’ ఒక ప్రేమకథ

‘ఉర్సు’గుట్టపై కనిపించే ‘సిద్ధోద్వాహము’ అనే సంస్కృత శాసన కావ్యం ఇద్దరు గంధర్వ దంపతుల ప్రేమకథ. దీనిని కాళిదాసు ‘మేఘదూతం’ అంత సుందరకావ్యంగా పండితులు అభిప్రాయప డ్డారు. ఇది శాసనంపై లిఖింపబడ్డ కావ్యం. సరిగ్గా ఈ మార్గాన్ని తొలిసారి తొక్కిన కవి వెల్లంకి గంగాధరుడు. ఈయన స్వయంగా రచించి వేయించిన నాలుగు శాసనాల్లో మూడు హనుమకొండలోను, ఒకటి నగునూరులోను కనిపిస్తాయి. హనుమకొండలోని శాసనాలు సంస్కృతంలో ఉన్నాయి. నగునూరు శాసనం మాత్రం తెలుగులో ఉంది. ఆయన కావ్యాలేవీ కనిపించకున్నా శాసన పద్య శైలియే కావ్య సదృశ్యమైన మనోహరత్వాన్ని కలిగి ఉన్నాయి ఈ పద్యాలు. శాసనంలోని తొలి పద్యం కావ్య ప్రారంభ పద్యం వలెనే శ్రీ కారంతో ప్రారంభించాడని అనడానికి ఈ కింది పద్యాన్ని గమనిస్తే తెలుస్తుంది. 

‘శ్రీరామాధిపుడింద్ర నీల నిభ శారీరుండుదారుండు గౌ

రీరామాధిపుడుజ్జల స్ఫటిక శారీరుండు ధీరుండు భా

షారామాధిపుడబ్జకేసరి లసచ్ఛారీ (ర తేజుం) డునుం

గారుణ్యంబున మాకు నీవుత సదాకాలంబు కామ్యార్థముల్’

ఇది శార్దూల విక్రీడితంలో సాగి మూడు పాదాల్లోనూ మూడక్షరాల ప్రాసాక్షరాలతో గొప్ప శైలీ మాధుర్యంతో పద్యాన్ని కొనసాగిం చాడు గంగాధరుడు. తానొక ప్రత్యేక కావ్య రచన చేసి ఉంటే ఒక మహాకవిగా సాహిత్య చరిత్రలో నిలిచి పోయేవాడు.

అన్ని పద్యాలూ ‘ఉత్తమ పురుష’లో!

కవిజనాశ్రయ కర్త మల్లియరేచన చతుష్ప్రాస వరకే పరిమితమై నా గంగాధరుడు మాత్రం శాసనంలోనే పంచప్రాసతో పద్యం రాసి మెప్పించిన ప్రతిభావంతుడు. శాసనాల్లో ఆయన రచించిన పద్యాలన్నీ ఉత్తమ పురుషలో ఉంటాయి. స్వయంగా తనను గురించి తాను చెప్పుకున్న పద్యాలు. ఈయన స్వయంగా పాలకుడు, కవి గనుక తాను నిర్మించిన ఆలయాల్లో వేయించిన శాసనాల్లో పద్యాలు తానే రాసినట్లు ఆ పద్యాలే సాక్ష్యమిస్తున్నాయి. దాదాపుగా శాసనాల్లో పద్యాలు ఉత్తమ పురుషలో ఉండి శాసన కవి గంగాధరుడేనన్న సత్యాన్ని రుజువు చేస్తున్నాయి.

కావ్యాలు తాటాకులపై రాసే కాలంలో వాటిని రాళ్లపై చెక్కిస్తే అవి శాశ్వతమవుతాయన్న భావనతో ఈ శాసన కవి ఆ రకంగా శాసనంపైనే ఒక కావ్యాన్ని ఆరంభించి, కృత్యావతారిక వరకు రచించాడు. ఈ 32 పద్యాలు అన్నీ శాసనంపై చెక్కబడ్డాయి. అంటే, ఒక విధంగా ఈ గంగాధరుడే ‘తొలి శిలాకావ్య నిర్మాత’ గా భావించిన సుప్రసిద్ధ చార్రితక పరిశోధకుడు, కవి డా॥ సంగనభట్ల నర్సయ్య అభిప్రాయం అక్షరసత్యం. ఆ తరువాతనే ‘ఉర్సు’గుట్టపై చెక్కబడ్డ గొప్ప ఖండకావ్యం ‘సిద్ధోద్వాహము’ శిలాకావ్యంగా వెలసింది. 

శ్రీహరి అవతారంగా బుద్ధుడు!

గంగాధరుని నగునూరి శాసనాన్నిబట్టి పట్టశాలలో ఒక బుద్ధ దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది. ఆయన బుద్ధుని శ్రీహరి అవతారంగా భావించినట్లుగా కూడా ఈ పద్యం వల్లే మనకు బోధపడుతున్నది.

“పరమేశుడు హరి బుద్ధ

స్వరూపుడై యసురవరుల వంచించుట నా

హరి యని పట్టశాలము

జిరముగ బుద్ధ ప్రతిష్ఠ జేసితి భక్తిన్‌”

ఈ పద్యాన్ని ఆధారంగా చేసుకునే గంగాధరుని ‘బుద్ధ దేవాలయ నిర్మాత’గానూ చెప్పవచ్చు. ఈ పద్యం కూడా ఉత్తమ పురుషలో చెప్పడాన్నిబట్టి నగునూరి శాసనం కూడా తాను రచించిందేనని స్పష్టమవుతున్నది.

‘గంగాధర’ను పాలించిన వాడు

కాకతీయ పాలకుడైన రుద్రునికి యుద్ధాలలో అండగా నిలిచి, ఒక పోరాట వీరుడైనాడు వెల్లంకి. రాజుకు విజయాలను తెచ్చిపెట్టిన కారణంగా రుద్రదేవుని నుండి నగునూరు రాజ్యాన్ని కానుకగా పొందాడు. ఈ రకంగా వెల్లంకి గంగాధరుడు పాలకుడైనాడు. అనేక విధాలుగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచాడు. ఆనాడు ‘గంగాధర’ ప్రాంతమంతా ఆయన ఏలుబడిలోనే ఉండేది. ఆ ప్రాంతపు ప్రకృతిలోని పచ్చదనానికి ముగ్ధుడైన కారణంగానే వెల్లంకి గంగాధరుడు అక్కడ ఆ గ్రామాన్ని నిర్మించాడని, ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంపై ఎంతో మక్కువతో ఇక్కడి నుండే ఆయన పాలన సాగిం చాడని ప్రముఖ శాసన పరిశోధకులు పీవీ పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయపడ్డారు. పైగా, ఆయన చల్లని పాలనకు గుర్తుగా ఆ గ్రామానికి ఆ పేరే నేటికీ ప్రాచుర్యంలో ఉండటం ఒక విశేషమని కూడా వారు పేర్కొన్నారు. 

గంగాధర గ్రామం ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడకు కేవలం 18 కి.మీ. దూరంలోనే ఉంది. అదే విధంగా ఈ ఊరికి సుప్రసిద్ధ నృసింహ క్షేత్రాలో ఒకటైన ధర్మపురి 40 కి.మీ. దూరంలోనే ఉంది. గంగాధర ఊళ్లో కూడా ఒక వైష్ణవాలయం ఉంది. గంగాధరుడు విష్ణు భక్తుడైనా శైవాన్ని, బౌద్ధాన్ని కూడా గౌరవించినట్లు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఆయన కాలం నాటి గంగాధరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. దీనివల్లే ఆయన పేరు (గంగాధరుడు) కూడా ప్రశస్తిలో నిలిచిపోయింది.

బ్రాహ్మణునికి లభించిన బహుమానం

రుద్రదేవునికి అత్యంత సన్నిహితుడైన వెల్లంకి గంగాధరుడు గొప్ప యుద్ధ నైపుణ్యంతోపాటు విశిష్టమైన మంత్రాంగం నెరపే మంత్రి కూడా. రణ విజేత కావడం వల్లనే ఆత్రేయస గోత్రజుడైన ఈ బ్రాహ్మణునికి రుద్రదేవుడు పాలన నిమిత్తం కొంత ప్రాంతాన్ని బహుమానంగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతున్నది. ఇది వెల్లంకి గంగాధరుని ప్రతిభా సామర్థ్యాలకు నిదర్శనం. కేవలం పాలనలోనేగాక సంస్కృతాంధ్ర భాషలో నిష్ణాతుడైన కవి వెల్లంకి. కనుకే, తాను వేయించిన శాసనాలలో తానే పద్యాలు రచించడం విశేషం. 

క్రీ.శ. 1150-1195 మధ్య కాలంలోని వాడైన వెల్లంకి గంగాధర మంత్రిగా ఉన్నప్పటికే నగునూరు పశ్చిమ చాళుక్యులకు రాజధానిగా ఉన్నది. కాకతి రుద్రదేవుని విజయం తర్వాత అది తన అన్ని  విజయాలలో ప్రధాన భాగస్వామియైన గంగాధరుని ఏలుబడిలోకి వచ్చింది. ఇంతటి వీరమూర్తి సంస్కృతాంధ్ర భాషా నిష్ణాతుడై శాసన కావాల్యకు ఆద్యుడు కావడం చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోయే సత్యం.

నగునూరు శాసనకావ్యం

హనుమకొండలో కనిపించే మూడు శాసనాలు సంస్కృతంలోను, నగునూరులోని (కావ్య) శాసనం తెలుగులోను ఉన్నాయి. ‘నిల్పితిని మహోత్సవమునన్’, ‘త్రైపురుషులం జేసితి’,‘నిల్పితిం గడు భక్తిన్’ వంటి ప్రయోగాలను ఆధారం చేసుకుని డా॥ సంగనభట్ల నర్సయ్య ఆయా శాసనాలన్నింటికీ వెల్లంకియే రచయిత అని భావించారు. ఇది పూర్తిగా అంగీకరించవలసిన సత్యం. వరంగల్లులో కనిపించే విశేషమైన పెద్ద శాసనం ప్రసన్న కేశవాలయ నిర్మాణ సందర్భంగా వేయించిందని డా॥ నర్సయ్య సప్రమాణంగా నిర్ధారించారు.

గన్నమరాజు గిరిజా మనోహరబాబు

9949013448