20-08-2024 12:30:00 AM
కోనో కార్పస్ మొక్కలతో ఆరోగ్యానికి ముప్పు కలిగే ప్రమాదాలు ఉంటాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రకమైన హానికారక మొక్కలను పూర్తిగా తొలగించడం మంచిది. జీవ వైవిధ్యం, పర్యావరణానికి హాని, మాన వాళి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే మొక్కలు ఏవైనా క్షేమదాయకం కావు. రాష్ట్రంలో అక్కడక్కడ కోనో కార్పస్ మొక్కలు విరివి గా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాంటి వాటిని అధికారులు వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలి.
గత ప్రభుత్వ హరితహారం కార్యక్రమంలో భాగంగానే పై విధమైన మొక్కలను నాటి, పెంచినట్లుగా తెలుస్తున్నది. కోనో కార్పస్ మొక్కలు పర్యావరణానికి హాని కలిగిస్తాయని, వాటివల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని నిపుణులు పేర్కొంటున్న తరుణంలో ప్రస్తుత ప్రభుత్వం వాటిని తొలగించవలసిందిగా విజ్ఞప్తి.
ముఖ్యంగా కోనో కార్పస్ చెట్ల పుప్పొడి శ్వాసకోశ వ్యాధులకు కారణం కాగలదని, కరోనా సోకిన వ్యక్తులు ఎలాగైతే శ్వాసకోశ సమస్యలతో బాధ పడతారో అదే స్థాయిలో ఈ చెట్ల గాలి పీల్చడం ద్వారా కూడా అంతటి తీవ్ర సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజారోగ్యం దృష్ట్యా కార్పస్ మొక్కలు తొలగించాల్సిన బాధ్యత మున్సిపాలిటీ అధికారులపై ఎంతైనా ఉంది.
-వావిలాల రాజశేఖర్ శర్మ, నాగర్ కర్నూల్ జిల్లా