01-05-2025 02:04:23 AM
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పరిపాలన విభాగంలో ఐఏఎస్ లు అత్యంత కీలకపాత్ర పోషిస్తారు. విధానాల రూపకల్పన, వాటిని అమలుచేయ డంలో ఐఏఎస్‌లు ఎంతో ముఖ్యం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కీలకమార్పులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల 20 ఐఏఎస్ అధికారులను ఒకేసారి బదిలీచేయడం ఇందులో భాగమేనని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర కావొ స్తున్న సందర్భంగా పరిపాలన విభాగంలో ప్రక్షాళనకు పూనుకున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.
దీనికితోడు త్వరలో నే మరో 30మంది ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తారని సమాచారం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని సగం జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం కల్పించే అవకాశం ఉన్నట్టు అధికారవర్గాల నుంచి వస్తున్న సమాచారం.
సమర్థత ఆధారంగా..
సమర్థత ఆధారంగానే ఐఏఎస్ పోస్టుంగులను ఇవ్వనున్నట్టు ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు స్పెషల్ సీఎస్ స్థాయి నుంచి జూనియర్ ఐఏఎస్ వరకు బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడపాదడపా ఐఏఎస్‌ల బదిలీలు చేసినప్పటికీ ఇంత భారీస్థాయిలో బదిలీ చేయడం గమనార్హం.
ఇటీవల 20మంది ఐఏఎస్‌లను బదిలీ చేయడంతోపాటు మరో 30 మంది ఐఏఎస్‌లను కూడా అదే క్రమంలో బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. వాస్తవానికి గత ప్రభుత్వంలో పనిచేసిన చాలా మంది అధికారులు ఆ స్థానంలోనే కొనసాగతున్నారు. ఈ నేపథ్యంలో ఆయాశాఖల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులను మార్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నది.
ఈక్రమంలోనే పరిపాలన విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. అయితే అధికారుల బదిలీ అంటే చాలా అనుమానాలు రేకెత్తుతాయి. ఆయా శాఖల్లో పనితీరులో అసమర్థత, అవినీతి, అక్రమాల ఆరోపణలు వంటి అనేక అంశాలు చర్చకు వస్తాయి. ఈ నేపథ్యంలో కొందరు అధికారులకు ప్రమోషన్ లభిస్తే, మరికొందరికీ ప్రాధాన్యం లేని శాఖల కేటాయింపు వంటి డిమోషన్ ఉంటుంది.
అసమర్థతా.. అసంతృప్తా..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయినప్పటికీ పరిపాలనలో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సహకరించడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉన్న తాధికారుల పనితీరుపై పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి సైతం అసంతృప్తి వ్యక్తం చేయడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. దీంతోపాటు ప్రభుత్వంలో కొనసాగుతూ రహస్యాలు బయటకు పంపుతున్నారని పలువు రు ఐఏఎస్‌లపై అనుమానాలు ఉన్నట్టు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఐఏఎస్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ కొందరు మాత్రం గత పాలకులకు సహకరిస్తున్నా రని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఐఏఎస్‌లను బదిలీ చేసి పరిపాలన వ్యవస్థను గాడిన పెట్టాల ని సీఎం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే త్వరలోనే మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీ ఉం టుందని సమాచారం.
దీని కోసం విషయ పరిజ్ఞానం, కొత్త కొత్త ఆలోచనలతో ప్రజల దగ్గరకు వెళ్లే సమర్థత ఉన్న అధికారులను గుర్తించి మంచి స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఏసీ రూములు వదిలి గ్రామాల్లో పర్యటించి ప్రజల అవసరాలు, ప్రభుత్వ పథకాలను వివరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలు వేదికలపై నుంచి అధికారులకు సూచించారు. అందులో భాగంగా విడతల వారీగా ఐఏఎస్‌లతోపాటు ఐపీఎస్, ఐఏఫ్‌ఎస్‌లను కూడా బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.