calender_icon.png 1 May, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లకు రూ.15వేల కోట్లు

01-05-2025 02:00:39 AM

  1. యాసంగిలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి.. 70 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు సర్కార్ సిద్ధం
  2. 127 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
  3. 8,381 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
  4. కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): యాసంగిలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం రూ.15వేల కోట్లు విడుదల చేసిందని రాష్ర్ట నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ధాన్యం దిగుబడిలో ఖరీఫ్ సీజన్‌లో దేశంలోనే రికార్డు సృష్టించిన తెలంగాణ యాసంగిలోనూ అదే రికార్డ్ సృష్టించబోతుం దని ఆకాంక్షించారు.

యాసంగిలో తెలంగాణ రైతాంగం 54.89 లక్షల ఎకరాల్లో సాగు చేయగా 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. 70 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకుగాను ప్రభుత్వం ప్రణాళికలు రూపొం దించుకున్నట్లు ప్రకటించారు.

బుధవారం పౌరసరఫరాలశాఖ కేంద్ర కార్యాలయం నుంచి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి మంత్రులు తుమ్మల, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ధాన్యం సేకరణలో రానున్న 20 రోజులు అత్యంత కీలకమైనవని ఈ సమయంలో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయాలని సూచించారు.

రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలులో ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడినట్లు కలెక్టర్ల దృష్టికి వస్తే సత్వరమే చర్యలు తీసుకోవడంతో పాటు పౌరసరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి డీఎస్ చౌహన్‌ను సంప్రదించాలని ఆదేశించారు. 

48గంటల్లో డబ్బుల చెల్లింపు..

ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల లోపు మద్దతు ధరను రైతుల ఖాతాలో జమ చేయడంతో పాటు సన్నాలకందించే బోనస్ చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లకు గాను ఇప్పటివరకు రాష్ర్ట వ్యాప్తంగా 8,381 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు 13.71 కోట్ల గోనెసంచులు అందుబాటులో ఉంచామని మరో 3.79 కోట్ల గోనెసంచులు సమీకరిస్తున్నట్లు ఆయన వివరించారు.

ఇప్పటికే 29లక్షల మెట్రిక్ టన్నులకు పై బడి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందని, 2.55 లక్షల రైతుల నుంచి 19.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం అందించే మద్దతు ధర ప్రకారం రూ.4,545.72 కోట్లు కాగా ఇప్పటివరకు రూ. 2,289 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు.

సన్నాలకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్ మొత్తం రూ.444.20 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందన్నారు. అలాగే కొత్తగా మంజూరు చేయనున్న తెల్లరేషన్‌కార్డుల కోసం లబ్ధిదారులు పెట్టుకున్న దరఖాస్తులను సునిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పరిశీలన పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు.