24-07-2025 12:00:00 AM
‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)-2025’ వేడుకకు రంగం సిద్ధమైంది. దక్షిణాది చిత్రాలు, అందులో ప్రతిభ కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఇచ్చే ఈ అవార్డుల వేడుక ఇప్పటివరకు 12 ఎడిషన్లు పూర్తి చేసుకుంది. వచ్చే సెప్టెంబర్ 5, 6 తేదీల్లో నిర్వహించనున్న 13వ ఎడిషన్‌కు దుబాయ్ వేదిక కానుంది. ఇక ఈ వేడుకలో కీలక ఘట్టం.. నామినేషన్స్ ప్రక్రియ.
నిరుడు దక్షిణాది రాష్ట్రాల్లో విడుదలైన పలు సినిమాలు వివిధ కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకోవడం ద్వారా బరిలో నిలిచాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల నుంచి నామినేట్ అయిన సినిమాల జాబితాను ‘సైమా’ కమిటీ బుధవారం ప్రకటించింది. తెలుగు నుంచి అత్యధిక నామినేషన్స్ దక్కించుకున్న సినిమాగా ‘పుష్ప2’ మొదటి స్థానంలో నిలిచింది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకుంది. కాగా, ఇప్పుడు ‘సైమా’లో ఏకంగా ఈ సినిమా 11 కేటగిరీల్లో పోటీ పడనుంది. 10 చొప్పున నామినేషన్లతో రెండో స్థానంలో ‘కల్కి2898ఏడీ’, ‘హను-మాన్’ నిలిచాయి. ‘కల్కి2898ఏడీ’ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించిన చిత్రం కాగా, ‘హను-మాన్’ తేజ సజా-ప్రశాంత్‌వర్మ కాంబోలో వచ్చింది.
ఇక తమిళంలో శివకార్తికేయన్ ‘అమరన్’ చిత్రానికి 13 నామినేషన్లు దక్కగా, ‘లబ్బర్ పందు’ చిత్రానికి 8, ‘వాళై’ 7 నామినేషన్లు పొందాయి. కన్నడ నుంచి ‘భీమా’ 9, ‘కృష్ణ ప్రణయ సఖి’ 9, ‘ఇబ్బని తబ్బిడ ఇలియాలి’ 7 నామినేషన్లు దక్కించుకున్నాయి. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడు జీవితం’ 10 నామినేషన్స్‌తో టాప్‌లో ఉండ గా, ‘ఏఆర్‌ఎం’కి 9, ‘ఆవేశం’కు 8 నామినేషన్లు దక్కాయి.