27-07-2025 12:12:09 PM
- కాలం చెల్లిన పాలతోనే పెరుగు తోడు.
- గంట తరువాత 65 మందికిపైగా విద్యార్థుల అస్వస్థత
- జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలింపు
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజాన్ అసలు కారణం కాలం చెల్లిన పాలతో పెరుగు తోడు వేయడమేనని తెలుస్తోంది. సాయంత్రం స్నాక్స్ ఉడికి ఉడకని క్యాబేజీతో కూడిన పకోడా తిన్న విద్యార్థులు రాత్రి సమయంలో కాలం చెల్లిన పెరుగుతో కూడిన కర్డ్ రైస్ తిన్న విద్యార్థులంతా అస్వస్థతకు గురైనట్లు వైద్యులు ధృవీకరిస్తున్నారు. శనివారం రాత్రి మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు సుమారు 65 మందికి పైగా కడుపునొప్పి వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా ఉదయం కొంతమంది విద్యార్థులు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన అనంతరం తిరిగి గురుకుల పాటశాలకు పంపారు.
మరి కొంతమంది విద్యార్థులు ఉదయం కూడా తీవ్ర కడుపు నొప్పి విరేచనాలతో బాధపడుతూ మరో 20 మంది పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిని కూడా అంబులెన్స్ సాయంతో జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం అప్రమత్తమై గురుకుల పాఠశాలలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి స్పందిస్తూ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. విషయం తెలుసుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ తదితర బృందం పాఠశాలలో పరిసరాలు భోజనానికి వినియోగించే కూరగాయలు ఇతర సామాగ్రిని పరిశీలించారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వం విద్యార్థుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా విద్యార్థులను పరామర్శించేందుకు వస్తున్నట్లు ప్రకటించారు.