16 August, 2026 | 7:32 PM

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య

24-05-2024 01:58 AM

పదిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సన్మానం

మెదక్, మే 23 (విజయక్రాంతి) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో తమ ప్రతిభను చాటి ఉత్తమ ర్యాంకులు సాధించడం జిల్లాకే గర్వకారణమని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ కొనియాడారు. గురువారం మెదక్‌లోని హెచ్ కన్వెన్షన్ హాల్‌లో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పదిలో సుమారు 400 మంది ఉత్తమ ఫలితాలు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు.

తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల గుణాత్మక విద్య వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌కు పదో తరగతి తొలిమెట్టని ఇందులో ప్రతిభ కనబర్చితే భవిష్యత్ బంగారు బాట పడుతుందన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులకు వినూత్న తరహాలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం 10/10, 9.8, 9.5 సాధించిన విద్యార్థులను మెమోంటో, సర్టిఫికెట్లతో సన్మానించారు. కార్యక్రమంలో డీఈవో రాధాకృష్ణ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.