10-05-2025 12:15:25 AM
దాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి
జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్
మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లాలో రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యాన్నిసేకరించి మిల్లులకు పంపించాలని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని కాసిపేట మండలం మల్కపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతుల సౌకర్యార్థం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుండి ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పి పి సి ఇంచార్జీలను ఆదేశించారు. వరిధాన్యం పరిశుభ్రత యంత్రం పనితీరును, రైతు కుప్పక పోసిన ధాన్యం తేమ శాతంను పరిశీలించి సూచనలు చేశారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ గా చెల్లిస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు రశీదు జారీ చేయాలని, రైతులు, ధాన్యం వివరాలను ట్యాబ్ లలో నమోదు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతు ఆటోమెటిక్ యంత్రంతో శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాల వద్దకు నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకురావాలని, అకాల వర్షాల సమయంలో కేంద్రాలలో అందుబాటులో ఉన్న టార్పాలిన్లను వినియోగించుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ. పురుషోత్తం, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, షెడ్యూల్డ్ కులముల సహకార సంస్థ ఈ.డి. చాతరాజుల దుర్గాప్రసాద్, తహశిల్దార్ భోజన్నలు ఉన్నారు.