ప్రత్యామ్నాయ నేత రాహుల్‌గాంధీనే
- యువతకు దూరమవుతున్న బీజేపీ
- దేశ విద్యార్థులకు అండగా కాంగ్రెస్
- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): దేశ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువత ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో, వారి సమస్యలకు పరిష్కారాలు చూపడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పెరుగుతున్న నిరుద్యోగం, వరుసగా జరుగుతున్న పరీక్షల పేపర్ లీకులు, విద్యార్థుల భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి, అవకాశాల కొరత-ఇవన్నీ దేశ యువతలో తీవ్ర నిరాశను కలిగించాయన్నారు.
వారిపై అణచివేతకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని గరువారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రశ్నించే గొంతులను అరెస్టులతో, బెదిరింపులతో అణచివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, భారత రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమని మంత్రి మండిపడ్డారు. ఇలాంటి క్లిష్ట సమయంలో లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ యువతకు అండగా నిలుస్తూ అసాధారణ నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిపారు.
రాజ్యాంగాన్ని కాపాడేందుకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు రాజీపడని పోరాటం చేయడం ఆయ న నాయకత్వంలోని గొప్పతనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. రాహుల్ గాంధీ రాజకీయాలు విద్వేషం, విభజనలపై కాదని, ప్రేమ, న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువలపై ఆధారపడి ఉన్నాయని, అందుకే దేశ యువత, మేధావులు, మధ్యతరగతి, సామాన్య ప్రజల్లో ఆయన పట్ల విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోందన్నారు.
రాహుల్‌గాంధీ కేవలం ప్రతిపక్ష నాయకుడిగానే కాకుండా, దేశానికి ప్రత్యామ్నాయ నాయకునిగా అవతరిస్తున్నారని చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే కాంగ్రెస్ పార్టీ రాజకీయాల లక్ష్యమన్నారు. ‘దేశ యువతకు మా పిలుపు ఒక్కటే. భయపడవద్దు. మీ హక్కుల కోసం, మీ భవిష్యత్తు కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు సాగండి.
కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది’ అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, ఆ యువత ఆకాంక్షలకు ప్రతిబింబంగా, ప్రజాస్వామ్య భారత నిర్మాణానికి నాయకత్వం వహించే ప్రత్యామ్నాయ నాయకునిగా రాహుల్‌గాంధీ ఎదుగుతున్నారని తెలిపారు.






