calender_icon.png 5 November, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర్యానాలో 25లక్షల ఓట్లు చోరీ అయ్యాయి : రాహుల్ గాంధీ

05-11-2025 02:18:02 PM

న్యూఢిల్లీ: హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని ఓట్ చోరీపై(Vote Chori) లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బుధవారం నాడు మీడియా సమావేశంలో(Rahul Gandhi Vote Chori) ఆరోపించారు. బీజేపీ నేతలు అనేక వ్యవస్థలను వినియోగించారని సంచలన ఆరోపణలు చేశారు. ఒక యువతి పేరుతో హర్యానాలో 22 ఓట్లు ఉన్నాయని వివరించారు. వివిధ పేర్లతో ఆ యువతికి ఓట్లు ఉన్నాయన్నారు. ఆ యువతికి పది వేర్వేరు బూత్ లలో 22 ఓట్లు ఉన్నాయని తెలిపారు. కొందరు వ్యక్తుల ఓట్లను కావాలనే జోడిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళ ఫొటో ఒకటే.. పేర్లు వేరు.. వయసులు వేరు.. జెండర్ వేరు అన్నారు. సీమా, స్వీటీ, సరస్వతి, ఇలా వివిధ పేర్లతో ఒకే యువతికి ఓట్లు ఉన్నాయని చెప్పారు.  హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తోందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.. కాని ఓడిపోయిందని చెప్పారు. హర్యానాలో 12.5 శాతం ఓట్లు నకిలీ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

8 సీట్లలో కేవలం 22 వేల ఓట్ల తేడాతోనే హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. హర్యానాలో బీజేపీకి 48 సీట్లు, కాంగ్రెస్ కు 37 సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. తప్పుడు చిరునామాలతో 93 వేలకు పైగా ఓట్లు ఉన్నాయన్నారు. నకిలీ ఫొటోలతో అనేక మంది ఓటర్లను జాబితాలో చేర్చారు. ఒకే ఫొటోతో రెండు బూత్ లలో 223 ఓట్లు ఉన్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. ఎన్నికల జాబితాలో కొన్ని చోట్ల బ్లర్ ఫొటోలు కూడా ఉన్నాయని చెప్పారు. ఫేక్ ఫొటోలతో 1,24,177 ఓట్లు ఉన్నాయని వివరించారు. ఒకే పేరు, ఫొటోతో అనేక ఓట్లు ఉంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. డూప్లికేట్ ఓటర్లను గుర్తించేందుకు ఈసీ వద్ద సాఫ్ట్ వేర్ ఉంది. సాఫ్ట్ వేర్ ఉన్నా 5 లక్షలకు పైగా డూప్లికేట్ ఓటర్లు ఎలా వచ్చారన్నారు. హర్యానాలో 1.18 లక్షల ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఓడిపోయిందని వెల్లడించారు. ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

బీజేపీకి లబ్ధి కలిగించేందుకు ఎన్నికల సంఘం ఇలా వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. హర్యానాలో ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీ ఓటు ఉందన్నారు. ఈసీ తలచుకంటే డూప్లికేట్ ఓట్లను సెకన్ లో నే తీసేది.. ఈసీ బీజేపీకి సహాయం చేస్తోందని ఆరోపించారు. యూపీలో ఓటు వేసిన వారు వేల సంఖ్యలో హర్యానాలోనూ ఓటు వేశారని సూచించారు. బీజేపీ వాళ్లు అయినంతమాత్రాన దేశంలో ఎక్కడైనా ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. వేలమందికి ఉత్తర్ ప్రదేశ్, హర్యానాలో ఓట్లు ఉన్నాయన్నారు. ఇళ్లు లేని ఓటర్లకు ఇంటి నంబర్ -0 ఇచ్చామని ఈసీ చెప్పింది.

ఇంటి నంబర్ -0 ఉన్న ఓటర్లను తాము తనిఖీ చేశామని రాహుల్ స్పష్టం చేశారు. ఓటర్లకు ఇళ్లు ఉన్నట్లు తమ తనిఖీల్లో తేలిందని వివరించారు. అనేకమంది చిరునామాలు తనిఖీ చేయకుండానే ఓట్లు ఇచ్చారని మండిపడ్డారు. సీఈఓ జ్ఞానేశ్ కుమార్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి చెందిన ఒక నేత ఇంట్లో 66 ఓట్లు ఉన్నాయన్న రాహుల్ గాంధీ మరో ఇంట్లో ఏకంగా 501 ఓట్లున్నాయని పేర్కొన్నారు. తాము తనిఖీలు చేస్తే ఆ ఇంట్లో అంతమది లేరన్నారు. ఇక ఇంట్లో 10కి మించి ఓట్లు ఉంటే తనిఖీ చేయాలని నిబంధన ఉందని గుర్తుచేశారు. ఈ విషయంలో ఈసీ కనీసం తనిఖీలు చేయలేదని అర్థమవుతోందన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు 3.50 లక్షల ఓట్లు లొలగించారని పేర్కొన్నారు. ఈసీని అడ్డం పెట్టుకుని బీజేపీ హర్యానాలో సర్కార్ చోరీ చేసిందని వెల్లడించారు. బీజేపీతో సీఈసీ చేతులు కలిపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. మా ప్రతి ఆరోపణకు ఆధారాలున్నాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.